గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు కట్టుబడి ఉన్నాం
` 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం
` ప్రభుత్వపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాం
` బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని చెప్పాం
` ఇప్పటికే గోదావరి, కృష్ణా బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం తెలిపాయి.
` ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖలు రాశాం: ఉత్తమ్
హైదరాబాద్(జనంసాక్షి): పోలవరం నుంచి గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ సర్కారు ప్రయత్నాల దృష్ట్యా రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టామని చెప్పారు. ‘‘బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని చెప్పాం. ట్రైబ్యునల్ తీర్పులు, చట్టాలు, జలసంఘం మార్గదర్శకాలకు విరుద్ధం. ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి లేఖలు రాశాం. రాష్ట్ర చర్యలతో పర్యావరణ శాఖ ఏపీ ప్రతిపాదనను వెనక్కి పంపింది. కేంద్ర జలశక్తిశాఖ, కేంద్ర జల సంఘం అభ్యంతరాలు తెలిపాయి. గోదావరి, కృష్ణా బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం తెలిపాయి. జులై భేటీలో పోలవరం, బనకచర్ల అజెండాగా చేర్చడాన్ని తిరస్కరించాం. పోలవరం, నల్లమలసాగర్ డీపీఆర్‌కు ఏపీ టెండర్లు పిలవగానే సుప్రీంలో పిటిషన్ వేశాం. పోలవరం విస్తరణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరాం. గోదావరి జలాల్లో 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. కేటాయించని వరదజలాలపై 2 రాష్ట్రాలను సంప్రదించాల్సిందే’’ అని ఉత్తమ్ తెలిపారు.



