దేశరాజధానిలో దారుణం

యువతిపై సామూహిక అత్యాచారం
నగరమంతా తిప్పుతూ బస్సులోనే అకృత్యం
తీవ్రగాయాలతో యువతి మృతి
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) :దేశ రాజధానిలో కామాంధులు చెలరేగిపోయారు. పట్టపగలు నడుస్తున్న బస్సులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె సఫ్దర్‌ జంగ్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పారామెడికల్‌ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ఓ బస్సులో బయలు దేరారు. అదే సమయంలో అదే బస్సులో ఉన్న కొందరు యువకులు ఆమెపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడి ఆమె స్నేహితుడి కొట్టి బస్సులో నుంచి కిందకు తోసేశారు. తర్వాత ఆమెను కూడా బస్సులో నుంచి కిందకు తోసేశారు. బాధితులిద్దరు మునిర్కా నుంచి ద్వారక వెళ్లేందుకు రాత్రి బస్సు ఎక్కారు. బస్సు మహిపాల్పుర్‌ చేరుకున్న సమయంలో సామూహిక అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. యువతి కడుపులో ఆమెకు తీవ్రమైన దెబ్బలు తగిలాయని, చిన్నప్రేవు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. అంతకు ముందు ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అన్నారు.