ధరణిలో ఇబ్బందులు.. ఏడాదైనా రైతులకు తప్పని తిప్పలు
జనం సాక్షి : ధరణిలో నిషేధిత జాబితాలో చేరిన పట్టాభూములు విడిపించుకునేందుకు ఏడాదిగా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నా కష్టాలు మాత్రం తీరట్లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దాదాపు లక్షమంది దరఖాస్తు చేసుకోగా సుమారు 20 శాతం మందికే పరిష్కారం లభించింది. 43 శాతం దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉండగా మిగిలిన 37 శాతం దరఖాస్తులను తిరస్కరించారు. ధరణి సమస్యల విభాగంలో దరఖాస్తుతోపాటు సమర్పించిన ఆధారాలను ప్రాతిపదికగా తహసీల్దార్, ఆర్డీవోలు పరిశీలన చేస్తున్నారు. అందుకు చాలా సమయం పడుతోంది. నిషేధిత జాబితాలో దేవాదాయ, అటవీ, భూదాన్ పేరిట భూములున్నాయి. వాటిని పరిష్కరించాలంటే ఆయాశాఖలు ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఆ శాఖల అధికారులు నిరాకరిస్తుండటంతో కలెక్టర్ల వద్ద పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్య వస్తే వీఆర్వో, ఆర్ఐ ద్వారా పంచనామాచేయించి తహసీల్దార్, ఆర్డీఓ విచారణ చేసేవారు. క్షేత్రస్థాయిలో వీఆర్వో వ్యవస్థ రద్దుతో ధరణి సేవలు లోపభూయిష్టంగా మారాయి. ఇప్పటికైనా ధరణి వ్యవస్థను రద్దు చేసి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
ఇటీవలే ధరణిలో సవరణలు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల లాగిన్‌లో మార్పులు చేయడంతో సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించారు. వాటిని ఇప్పడికప్పుడు పరిష్కారం చేయడం అంత వేగంగా సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో సేవలందించిన విశ్రాంత అధికారుల సూచనలు తీసుకొని ధరణి అమలు చేసినట్లేతే ఈ సమస్యలు వచ్చేవి కావని చెబుతున్నారు.
కొలిశెట్టి లక్ష్మయ్య, మాజీ ఛైర్మన్ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం
సాధారణంగా దరఖాస్తు అధికారి తిరస్కరిస్తే కారణం తెలపాలి. కానీ నెలలు గడుస్తున్నా తిరస్కరించడానికి గల కారణాలు చెప్పకపోవడంపై సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చాలా భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తుడటంతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టినప్పుడే భూయజమానుల భాగస్వామ్యం తీసుకుంటే బాగుండేదని భూచట్టాల రూపకల్పన నిపుణులు సూచిస్తున్నారు.
ప్రొఫెసర్ ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల రూపకల్పన నిపుణులు
పట్టా భూమిని నిషేధితజాబితాలో చేర్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ, ఇతర అవసరాల కోసం భూమి విక్రయించాలంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ కావడం లేదు. వాటికి తోడు పేరు, సర్వే నంబరు తప్పు ఉందని, కమతం విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల పరిష్కారానికి ధరణిలో సరైన మార్గం లేకపోవడం వల్ల సమస్యలు తప్పడం లేదు. కొన్ని సమస్యలు మినహా ధరణి అద్భుతంగా ఉందని వాటని పరిష్కరిస్తే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.
బి.గీత, తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్
భూసమగ్ర సర్వే చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇప్పటికే ఆ దిశగా కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆ మేరకు మంత్రివర్గం ఉపసంఘం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందని వివరించారు.
నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
ఇప్పటికైనా వేగంగా దరఖాస్తులను పరిష్కరిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.