ధాన్యం కొనుగోళ్లు..రైతుల్లో దైన్యం


నేతల మాటలతూటాలతో సమస్య పక్కదారి
తరుగు, తేమ పేరుతో మరింత దోపిడీ
హైదరాబాద్‌,నవంబర్‌9 జనం సాక్షి  :  ధాన్యం కొనుగోళ్లపై మాటల యుద్దం నడుస్తోంది. అధికార టిఆర్‌ఎస్‌, బిజెపిల మధ్య యుద్దంతో అసలు సమస్య పక్కకు పోతోంది. ఈ ఏడు ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై హావిూలే తప్ప కార్యాచరణ కానరావడం లేదు. అనేక జిల్లాల్లో ధాన్యం రాసులుగా తరలించి తీసుకుని వస్తున్నారు. మార్కెట్ల వద్ద ధాన్యంతో పడిగాపులు పడుతున్నా కొనుగోళ్లు సాగడం లేదు. జిల్లాల్లో ఏ కొనుగోలు కేంద్రం చూసినా ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపు ధాన్యం కుప్పులు కుప్పలు గా దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వేచిచూస్తే తప్ప తూకం కావడంలేదు. ధాన్యాన్ని తరలించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం ఆరబోసి తెచ్చిన తూకంలో తరుగు తప్పడంలేదు. చివరకు మిల్లులకు వెళ్లినా తేమ ఉంది, నూక అవుతుందని మరింత తగ్గిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులు, మిల్లర్లు చెప్పినట్లు ధాన్యాన్ని అమ్మకాలు చేస్తున్నారు. సీరియల్‌ నెంబరు ఆధారంగా కొనుగోళ్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం, ప్రతిరోజూ కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేయడం వల్ల వేగంగా కొనుగోళ్లు జరగడంలేదు. అకాల వర్షాలు, పెరిగిన చలి వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో కూడా రైతులు ధాన్యాన్ని ఆరబోసి తెచ్చిన తేమశాతం తక్కువగా ఉన్న త్వరగా కొనుగోళ్లు జరగడంలేదు. దీంతో ఏ కొనుగోలు కేంద్రం చూసినా భారీగా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. కుప్పల వద్ద రోజుల తరబడి రైతులు ఉంటునే ధాన్యం అమ్మకాలను చేస్తున్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే తరలింపు చేయకపోవడం వల్ల ఎక్కువ రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వాహనాల కొరత, హమాలీలు తక్కువగా ఉండడం వల్ల ధాన్యం తరలింపు జరగడంలేదు. తరలించేంతవరకు రైతులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మిల్లుకు వెళ్లిన రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు.అధికారులు తరుగు తీయవద్దని చెప్పినా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడంలేదు. మిల్లర్‌లతో మిలాఖత్‌ అయి ఈ కొనుగోళ్లను చేస్తున్నారు. రైతులతో పాటు రైతు సంఘాల నేతలు తరుగు తీయవద్దని కోరుతున్నా ఎవరు పట్టించుకోవడంలేదు. కలెక్టర్‌ కొన్ని కొనుగోలు కేంద్రాలను పర్యటించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినా ఇతర కేంద్రాల వారు తరుగు తీస్తున్నారు. అసలే భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఈ తరుగు మరింత నష్టంకలిగిస్తుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.ప్రతీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేస్తున్నా కడ్తా మాత్రం తీస్తున్నారు. తేమ, మట్టి, గడ్డి, ఇతర సమస్యలు చెప్పి క్వింటాలుకు 3 కిలోల వరకు తరుగు తీస్తున్నారు.మెజార్టీ కేంద్రాల్లో మాత్రం క్వింటాలుకు 3కిలలోల వరకు తరుగు తీస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉన్న రైతులు ఈ తరుగుకు ఒప్పుకున్న మిల్లులకు వెళ్లిన తర్వాత మళ్లీ ఇబ్బంది తప్పడంలేదు. కొంతమంది మిల్లర్లు ధాన్యం బాగా లేదని తిప్పి పంపుతామని చెబుతున్నారు. రెండు నుంచి నాలుగు కిలోల వరకు క్వింటాలుకు తగ్గిస్తే ధాన్యాన్ని తీసుకుంటున్నారు. కొంతమంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేసిన చోట మిల్లర్లు వెంటనే తీసుకుంటున్నారు. వర్షాలు, చలిపెరగడం వల్ల రైతులు కూడా తప్పనిసరి పరిస్థితిలో ధాన్యాన్ని అమ్మకాలు చేస్తున్నారు. దీంతో రైతులు విధిలేక తెగనమ్ముకుంటున్నారు. దీనిపై మంత్రులు, అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని చెబుతున్నా ఎక్కడా కాంటాలు ముందుకు
సాగడం లేదు.