నగర సుందరీకరణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

కర్నూలు, ఆగస్టు 2 : నగర సుందరీకరణలో భాగంగా, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి పరిశీలించారు. గురువారం నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ డ్రైనేజి, నారాయణ మూర్తి పెట్రోల్‌ బంకు ఎదురుగా నిర్మిస్తున్న కల్వర్టు, రాజవిహార్‌ నుంచి హంద్రీ వరకు జరుగుచున్న ఫుట్‌పాత్‌, డ్రైనేజి పనులను కలెక్టర్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ మూర్తి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు. అలాగే హంద్రీ నదిపై బ్రిడ్జికి ఇరువైపుల వేస్తున్న రంగులు, అందమైన దీపాలంకరణ, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర వేయనున్న ఫ్లవర్‌ గార్డెన్‌, హంద్రీ పరిసరాలు ఆక్రమించిన స్థలం, హంద్రీ నుంచి బుధవారపేట మీదుగా యన్‌.టి.ఆర్‌ సర్కిల్‌ వరకు అవసరమైన రోడ్డు విస్తీర్ణం కోసం తొలగిస్తున్న భవనాలు పనులను కలెక్టరు పరిశీలించారు. అనంతరం సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ నగరంలో పరిసరాల్లో శానిటేషన్‌, పారిశుద్ధ్యంపై తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రజల ఆస్తులైన డ్రైన్సును పందుల స్థావరాలకోసం మార్చుకునే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో పారిశుద్ధ్యంపై ఎక్కడ కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా నగరంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని పరిశుభ్రతను పాటించి అంటువ్యాధులు, సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంట నగరపాలక సంస్థ కమీషనర్‌ మూర్తి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ రంగారెడ్డి, సిబ్బంది రమణ తదితరులు పాల్గొన్నారు.