నల్గొండ ఎమ్మెల్యేల బృందానికి నిరసన సెగ

ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం
మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై
ఫ్లోరైడ్‌ బాధితుల అక్రోశం
అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ
నల్గొండ, జూలై 7 : బాధపడకండి.. సమస్యలను తెలుసుకుంటున్నా.. ప్రభుత్వానికి నివేదిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా అని అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఫ్లోరైడ్‌ బాధితులకు అభయం ఇచ్చారు. ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాలలో శనివారంనాడు పర్యటించారు. బాధితులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాంపల్లి మండలం సుంకేసులలో పర్యటించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మర్రిగూడ మండలం కుదాభక్ష్‌పల్లిలోను, చండూరు మండలం గట్టుప్పల్‌లోను పర్యటించారు. పుట్టగండి వద్ద మహిళలు నిరసన తెలిపారు. శనివారం సాయంత్రంతో పర్యటన ముగియనున్నట్టు తెలుస్తోంది. సుంకేసులలో నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ఫ్లోరైడు ప్రాంతాలలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే తాము ఈ పర్యటన చేపట్టామన్నారు. బాధితుల సమస్యలను ప్రభుత్వానికి ఒక వారం రోజుల్లోగా వెల్లడిస్తానని తెలిపారు. ఫ్లోరైడ్‌ నిర్మూలనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్‌ బాధితులకు భరోసా కల్పించేందుకే తాను ఈ పర్యటన చేపట్టానన్నారు.