నిలిచిపోయిన సోషల్ మీడియా
` వాట్సాప్,ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం
దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలు గత కొన్ని నిమిషాల నుంచి నిలిచిపోయాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ నుంచి సందేశాలు వెళ్లడం, రావడం పూర్తిగా నిలిచిపోయాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సైతం ఫీడ్ రీఫ్రెష్ అవ్వడం లేదు. దీంతో పలువురు యూజర్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా పనిచేయడం లేదంటూ పోస్టులు పెడుతున్నారు.
సేవలకు అంతరాయం ఏర్పడడంపై ఫేస్‌బుక్ స్పందించింది. ‘‘క్షమించాలి. ఏదో తప్పిదం జరిగింది. దానిపై మేం పనిచేస్తున్నాం. సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాం’’ అని పేర్కొంది. వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తమ దృష్టికి వచ్చినట్లు వాట్సాప్ సైతం ట్వీట్ చేసింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫేస్‌బుక్‌కు చెందినవే కావడం గమనార్హం. భారత్‌లో ఫేస్‌బుక్‌కు 41 కోట్ల మంది యూజర్లు ఉండగా.. 53 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. 21 కోట్ల మంది ఇన్‌స్టాను వాడుతున్నారు.