పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న డీసీ


న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఐపీఎల్‌లో ఢల్లీి క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్‌ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. ఐపీఎల్‌-2021 మలి దశ మ్యాచ్‌లకు పంత్‌ను తప్పించి, అతని స్థానంలో తిరిగి శ్రేయస్‌ అయ్యర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేందుకు డీసీ యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. డీసీ యాజమాన్యం అందరికంటే ముందుగానే శ్రేయస్‌ను యూఏఈకి పంపి పరోక్ష సంకేతాలు పంపింది. కాగా, భుజం గాయం కారణంగా భారత్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 మొదటి దశ మ్యాచ్‌లకు దూరమైన శ్రేయస్‌.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో వాయిదా పడిన ఐపీఎల్‌ సీజన్‌తో సహా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు సిద్దమేనని అతను ప్రకటించాడు. స్వదేశంలో గత మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా శ్రేయస్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఫీల్డింగ్‌ చేస్తూ.. బౌండరీ ఆపే క్రమంలో అతను గాయపడ్డాడు. ఇదిలా ఉంటే, రిషబ్‌ పంత్‌ సారధ్యంలో డీసీ జట్టు తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు(8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ జట్టులోకి వచ్చినా పంత్‌ కెప్టెన్సీకి ఎటుంవంటి ఢోకా ఉండదని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా డీసీ జట్టు పంత్‌ను కాదని శ్రేయస్‌కే ఓటేసినట్లు డీసీ వర్గాల సమాచారం. ఢల్లీి క్యాపిటల్స్‌ను శ్రేయస్‌ గతేడాది ఫైనల్‌కు చేర్చిన విషయాన్ని యాజమాన్యం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్‌ మాత్రం కెప్టెన్సీ గురించి తాను ఆలోచించట్లేదని చెప్పడం కొసమెరుపు.కాగా, యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ఐపీఎల్‌-2021 మలిదశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఢల్లీి క్యాపిటల్స్‌ శనివారం ఉదయం యూఏఈకి బయలుదేరుతుంది. దేశ రాజధానిలో దేశీయ ఆటగాళ్లు ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నారు. యూఏఈ చేరుకున్న తర్వాత కూడా డీసీ బృందం మరోవారం క్వారంటైన్‌లో ఉండనుంది.