పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు గట్టి చర్యలు

నిజామాబాద్‌, జూలై 19 : ఎపిపిఎస్సీ నిర్దేశించిన నిబంధనలు, ఆదేశాల ప్రకారం గ్రూప్‌-2 పరీక్షను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు తప్పనిసరిగా రైటింగ్‌ ప్యాడ్‌ వెంట తెచ్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వరాచారీ తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఎపిపిఎస్సీ గ్రూప్‌-2 విధులు నిర్వహించే అధికారులకు గురువారం నాడు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 21న జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1 మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు, 22న పేపరు-2 ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు, పేపరు-3 మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు జరగనున్నాయన్నారు. ఈ పరీక్షకు గాను 13,650 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 38 మంది ముఖ్య పర్యవేక్షకులను, 8 రూట్లను, 38 మంది లైజన్‌ అధికారులు, 38 మంది సిట్టింగ్‌ స్వ్కాడ్‌లను నియమించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పరీక్షలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద నియమ, నిబంధనలను పాటించేలా తెలియజేయాలని ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణకు డి.టి.సి అవసరమైన వాహనాలను సమకూర్చాలని, పరీక్ష తేదీలలో ఉదయం, సాయంత్రం సమయాలలో ఆర్టీసి అధికారులు అవసరమైన అదనపు బస్సులను నడపాలని, సంబంధిత ముఖ్య పర్యవేక్షకులు వారు విధులు నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో పని చేసే సిబ్బందిని, ఇన్విజిలేటర్లుగా నియమించుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్య ఆరోగ్య శాఖ, ప్రథమ చికిత్స సామాగ్రిని ఏర్పాటు చేయాలని, అన్ని జిరాక్స్‌ కేంద్రాలు మూసి ఉంచాలని, పరీక్ష సమయాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా కొనసాగించాలని డిఆర్‌ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా అనుమతిస్తామని, నిర్ణీత పరీక్ష సమయం ప్రారంభమైన 10 నిమిషాల అనంతరం పరీక్షల కేంద్రాల ప్రధాన గేట్లను మూసేయాలని తెలిపారు. అభ్యర్థులు బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ వెంట తెచ్చుకోవాలని, వైట్‌నర్‌ అనుమతించబడదని, అదే విధంగా సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, క్యాలిక్యూలేటర్లులోనికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించకూడదన్నారు. హాల్‌టికెట్లు కలిగిన అభ్యర్థులు, విధులలో ఉన్న సిబ్బందిని మినహా ఇతరులెవ్వరినీ పరీక్ష కేంద్రానికి అనుమతించకూడదన్నారు. డిఎస్‌పి రామ్‌మోహన్‌రావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వినాయక్‌నగర్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలను ఒక పరీక్ష కేంద్రంగా ఎన్నిక చేయడం జరిగిందని, ఈ కేంద్రంలో ఎ,బి కేంద్రాలకు గాను అనివార్యకారణాల వల్ల బి సెంటర్‌ను వినాయక్‌నగర్‌లోని శ్రీనిధి డిజిటల్‌ పాఠశాలకు మార్చడం జరిగిందని, ఈ సెంటర్‌కు సంబంధించిన విద్యార్థులు మార్పును గమనించాలని డిఆర్‌ఓ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఇఓ శ్రీనివాసచారీ, పిడిలు వీరాచారీ, వెంకటేశం, ఆర్‌టిసి ఆర్‌ఎం కృష్ణకాంత్‌, తహసీల్ధార్‌ రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.