పక్బందీగా జనగణన

నెల్లూరు, జూలై 18: జిల్లాలో బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణన నిర్వహించాలని జనాభా లెక్కలవిభాగం డైరెక్టర్‌ వైవి అనూరాధ అన్నారు. స్థానిక గోల్డన్‌ జూబ్లీ హాలులో బుధవారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బయోమెట్రిక్‌ విధానం వలన జనగణన సులభమని ప్రజలకు అనేక విషయాలు పారదర్శకంగా అందించవచ్చని అన్నారు. నివేశన స్థలాల కేటాయింపు విషయంలో కూడా బయోమెట్రిక్‌ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామాల్లో జనగణన చేపట్టేందుకు విలేజి డైరీని రూపొందిస్తున్నామని అనూరాధ చెప్పారు. 2011 నుంచి అమలవుతున్న ఈ విధానం వల్ల గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారాన్ని ఇందులో నిక్షిప్తం చేయవచ్చని అన్నారు. విలేజీ డైరీ వల్ల దేశంలోని అన్ని గ్రామాల్లో జననగణన చురుకుగా సాగుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ రామిరెడ్డి, చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి కె.మూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.