పది రోజుల్లో వ్యర్థాలను తొలగించండి
– నగరం మొత్తం స్వచ్చత వాతావరణం నెలకొనేలా చూడాలి
– అశ్రద్ద వహించే అధికారులపై చర్యలు
– కీలకమైన రహదారులపై ఏ విధమైన భవన నిర్మాణాలు, వ్యర్ధాలు కనిపించొద్దు
– నిబంధనలకు విరుద్దంగా వెళ్లే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి
– ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వండి
– జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిషోర్
– కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్
హైదరాబాద్, ఆగస్టు29(జనం సాక్షి) : నగరంలోని రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్, రాళ్లు తదితర వ్యర్థపదార్థాలను పదిరోజుల్లోగా పూర్తిగా తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఇంజనీరింగ్, మెడికల్ అధికారులతో బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సవిూక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ రోడ్ల నిర్వహణపై నగరవాసుల్లో సానుకూల దృక్పథం కలిగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. తమ పరిధిలో రోడ్లపై గుంతల పూడ్చివేత, రోడ్ల నిర్మాణంతో సహా అన్ని ఇంజనీరింగ్ సివిల్ పనులను సకాలంలో పూర్తిచేయడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యత జోనల్, డిప్యూటి కమిషనర్లదేనని స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీలతో పాటు ఎన్నో బహుళ జాతి సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యాలయాలు ఉన్న నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ అదే స్థాయిలో చేపట్టాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ పై ఉందని అన్నారు. నగరంలో ప్రధానంగా ఉన్న 2వేల కిలోవిూటర్ల విస్తీర్ణంలోని రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, గార్బేజ్, రాళ్లు, రప్పలను పది రోజుల్లోగా పూర్తిగా తొలగించాలని స్పష్టం చేశారు. సి అండ్ డి వ్యర్థాల తరలింపుకు ప్రస్తుతం ఉన్న 22 వాహనాలను 100కు పెంచడానికి సంబంధిత ఏజెన్సీ అంగీకరించిందని కమిషనర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అత్యంత కీలకమన్న విషయాన్ని గుర్తించి చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. పదిరోజుల గడువు అనంతరం పారిశుద్య కార్యక్రమాల నిర్వహణపై నిరంతరం సవిూక్షించడం జరుగుతుందని, ఈ విషయంలో విఫలమయ్యే క్షేత్రస్థాయి అధికారులపై తగు చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పూర్తిగా సంబంధిత డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లదే బాధ్యత అని స్పష్టం చేశారు. నగరంలోని అత్యంత కీలకమైన రహదారులపై ఏ విధమైన భవన నిర్మాణ, మున్సిపల్ వ్యర్థాలుగానీ కనిపించవద్దని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై నిర్మాణ, మున్సిపల్ వ్యర్థాలను వేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఈ విషయంలో నగరవాసులను చైతన్యపర్చాలని పేర్కొన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు జలమండలి వద్ద ఉన్న 44 ప్రత్యేక వాహనాలను సీ అండ్ డి వేస్ట్ తొలగింపుకు ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. నగరంలో పలు సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారని, ఆ ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తెస్తున్నందున యుద్ద ప్రాతిపదికపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధ్యాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. ఈ సవిూక్షలో అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, విజిలెన్స్ డైరెక్టర్‌విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దిన్, జోనల్ కమిషనర్లు భారతి ¬లీకేరి, హరిచందన, రఘుప్రసాద్, రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డిలు హాజరయ్యారు.


