పలాసలో ఆదాయపు పన్ను శాఖ దాడులు

శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని పలాసలో గల భాగ్యలక్ష్మి, వాసవీ బియ్యం మిల్లులో ఆదయపు పన్నుల శాఖాధికారులు దాడులు చేపట్టారు. జోన్‌-1, జోన్‌-2 లకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నవీన్‌కుమార్‌, ఆల్వార్‌లతో పాటు నాగరాజు, సత్యనారాయణలతో కూడిన బృందం పాల్గొని దాడులు నిర్వహించారు. సంబంధిత వ్యాపారులు డి.రామారావు, శంకరరావులకు చెందిన బ్యాంకు ఖాతాలను ఎస్‌బీఐ, కరూర్‌వైశ్యాబ్యాంకుల్లో తనిఖీ చేశారు. వ్యాపారానికి సంబంధించిన సరుకు నిల్వలు, జరిపిన లావాదేవీల చిట్టాలను పరిశీలించారు. అనంతరం దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. పలాసలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన నేపథ్యంలో పలువురు వ్యాపారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జీడి వ్యాపారులకు సంభందిన జాబితాను ఆదాయపు పన్ను శాఖకు అనుబంధంగా ఉండే సీబీఐ సేకరించిన విషయం విధితమే. ఇంతలో ఈ దాడులు జరగడంపై చర్చ జరుగుతుంది. ఆదాయానికి తగ్గ పన్ను చెల్లించడం లేదని ఆ శాఖ గుర్తించి వ్యాపారుల జాబితా సేకరించినట్లు సమాచారం.