పాఠశాల స్థలాలను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయండి

జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌
శ్రీకాకుళం, ఆగస్టు 3: శ్రీకాకుళం పట్టణంలోని ఎన్టీఆర్‌ పురపాలకోన్నత పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతున్న తీరుపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు పురపాలక సంఘం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై తెలుసుకునేందుకు అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఇక్కడి పురపాలక సంఘ కార్యాలయంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.భాస్కర్‌ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో ఉన్న ఇబ్బందులను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు కల్సించడంలో ఎందుకు ఇన్నాళ్లు నిర్లక్ష్యం వహించారని కమిషనర్‌ పి.వి.రామలింగేశ్వర్‌ను ప్రశ్నించారు. పాఠశాల అభివృద్ధి కోసం వార్షిక బడ్జెట్‌లో ఎంత కేటాయించారంటూ ప్రశ్నించారు. వీటి మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. మరమ్మతులకు సంబంధించి ఇంజినీరింగ్‌ అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలకు, ప్రధానోపాధ్యాయులు తెలియజేసిన సమస్యలకు పొంతన లేకపోవడంతో ఇంజినీరింగ్‌ పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ పురపాలకోన్నత పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లు తమకు అప్పగించలేదని దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు జేసీకి ఫిర్యాదు చేశారు. దీనికి ఆయన ఇంజినీరింగ్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా సహించొద్దన్నారు. ఆక్రమణలు తొలగించాలని, అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ పి.వి.రామలింగేశ్వర్‌, ఈఈ రామ్మోహన్‌రావు, డీఈఈ డి.సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.