పాల్వంచలో పెరుగుతున్న మలేరియా రోగులు

ఖమ్మం, జూలై 24 : ఖమ్మం జిల్లా పాల్వంచలో విషజ్వరాలు విజృంభించడంతో పట్టణమంతా ఒణికిపోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోడులతో కిటకిటలాడుతున్నాయి. విషజ్వరాల తీవ్రత నానాటికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దోమల కారణంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన మలేరియా వ్యాధి విస్తరించింది. ఏజెన్సీ ప్రాంతమై పాల్వంచ, ములకలపల్లి మండలాలకు చెందిన దాదాపు 30 కేసులు ప్రభుత్వ వైద్యశాలలో నమోదు కాగా ఇంకా ఎందరో రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాల్వంచను మలేరియా బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.