పెళ్ళిళ్ల సీజన్‌ ప్రారంభం.. కళ్యాణమండపాలు ఫుల్‌ పెరిగిన పెళ్లి ఖర్చుతో..మధ్యతరగతి కుదేలు

ఒంగోలు, జూలై 21:శ్రావణమాసం వచ్చింది. పెళ్లిళ్ల సీజను ఆరంభమైంది. నెలరోజుల క్రితమే పెట్టుకున్న ముహూర్తాలకు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. శనివారం నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు వచ్చాయి. ఒంగోలు పట్టణంలో దాదాపు అన్ని కళ్యాణ మండపాలు పెళ్లిళ్లకు నమోదయ్యాయి. తొలిరోజునే రద్దీ అంతగా వుంది. వర్షాకాలం కావడంతో ఎవరూ ఇళ్లవద్ద పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సాహసించవలేని పరిస్థితి వచ్చింది. శ్రావణ మాసం ఆరంభంలోనే వాతావరణం కళకళలాడింది. కరువు పరిస్థితులు కన్నా పెళ్ళిళ్ళకు మాత్రం మధ్యతరగతి వర్గాల్లో ఖర్చుకు వెనుకాడటం లేదు. అన్ని వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. భారీ మాల్స్‌లో కొనుగొళ్లు రద్దీ బాగా వుంది. కొందరు విజయవాడ, చెన్నయ్‌లకు కూడా వెళుతున్నారు. పట్టుచీర్లకు గిరాకీ పెరిగింది. పెళ్ళింటే పెద్దపందిరి, మేళాలు తాళాలుతో సరిపెట్టుకునే రోజులు పోయాయి. ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంత బాగా చేశామనే చర్చకు తహతహలాడుతున్నారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు సాఫ్‌వేర్‌ ఉద్యోగులయితే విలాసంగా పెళ్ళి జరపాలనే ఒప్పందాలు కూడా జరిగిపోతున్నాయి. పైగా పల్లెటూరిలో పెళ్లికి ఎవరూ అంగీకరించడం లేదు. పట్టణాల్లో ఏసీ హాళ్లలోనే పెళ్లిళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పెళ్ళి చేసి చూడు, ఇల్లుకట్టిచూడు అన్న సామెత నిజంగానే పెళ్లి చేసేవారికి గుర్తుకు వస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇపుడు అన్ని విధాలుగా నలిగిపోతున్నారు. తమ కూతురుకు ఏమీ తక్కువ కాకుండా చూడాలనే భ్రమల్లో అప్పులు చేసి అన్ని జరపాల్సిన స్థితికి వచ్చారు. అభ్యుదయంగానో, ఆదర్శంగానో పెళ్లిచేసుకుందామనే ఆలోచనలో మద్యతరగతి కుటుంబాల్లో ఎవరూ కనిపించడం లేదు. ఇక సామాన్యులు కూడా వీరిని చూసి కొందరు వాతలు పెట్టుకుంటున్నారు. చిన్నచిన్న రైతుకుటుంబాలకు సైతం ఈ ఆర్బాటపు జాడ్యం అంటుకుంది. ఒంగోలులోని ఏసీ పంక్షన్‌ హాళ్లలో జరుగుతున్న పెళ్ళిళ్ళ ఖర్చు ఎంత తక్కువ వేసుకున్నా పదినుంచి పాతిక లక్షలు అవుతోందని సమాచారం. పోలీసు కళ్యాణ మండపంలో జరిపితే హాలు అద్దె, అలంకరణ, లైటింగు వంటివి కలుపుకుని మూడు లక్షల వరకూ చెల్లించాల్సి వస్తోంది. దుస్తులు, నగలు, బంగారం, వాహనాలు వంటివి భారీగానే ఉంటున్నాయి. కొందరు ఇప్పటి వరకూ చిన్నచిన్న ఇళ్లలో సర్తుకుని జీవించినప్పటికి పెళ్లి సమయంలో పెద్ద ఇంటిలోకి మారుతున్నారు. ఇదొక భారంగానే పరిగణించకతప్పదు. తిండి ఇతరత్రా వారి స్థోమతను బట్టి ఉంటుంది. వెయ్యి మందిని పలిచినా ఒక్కొక్కరికీ నూటయాభైనుంచి మూడు వందల వరకూ భోజనం ఖర్చు పెట్టే మెనులు సిద్ధంగా ఉన్నాయి. భోజనాలను తయారుచేయడానికి పెద్ద పెద్ద సంస్థలు రంగంలోకి వచ్చాయి. చెన్నయ్‌ నుంచి కూడా ఇక్కడకు వచ్చి ఆర్డర్లు తీసుకుంటున్నారు. బాపట్ల, తెనాలి ప్రాంతాలనుంచి కూడా భోజనం సంస్థల నిర్వాహకులు వస్తున్నారు. భోజనాలకు కనీసం ఐదారులక్షలు చెల్లించకతప్పదు. ఇలా అన్ని రకాలుగా ఖర్చులు పెరిగాయి. ఒక కరువు, వర్షాభావం, కరెంటు కోతలతో అన్ని రకాలుగా సమస్యలు పెరిగాయి. జనరేటర్లు తప్పని సరైంది. ఇదొక భారం. వీటికి తోడు అన్ని రకాల ధరలు పెరిగాయి. దీంతో ఖర్చులు కూడా ఊహించకుండానే రెట్టింపయ్యాయి. కూరగాయలు ధరలు చూస్తే ఏదీ కూడా కిలో రూ. 30కి తక్కువగా లేదు. భోజనాల ఖర్చులు పెరగడానికి ఇదొక కారణంగా చెబుతున్నారు. పాలు లీటరు వెన్న తీసినవే లీటరు రూ. 40లకు చేరాయి. కొందరు గ్రామాలనుంచి పాలను సేకరించి తెచ్చుకుంటున్నారు. అక్కడ వెన్నతీయనివే లీటరు రూ. 35కు దొరుకుతున్నాయి. వీలున్నవాళ్లు కూరగాయలను కూడా గ్రామలనుంచి తెప్పించుకుంటున్నారు. ఒంగోలు మార్కెట్‌లో ఏది కొనాలన్నా ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసరాలు ధరలు కూడా ఇదే పరిస్థితి, ఉప్పు, పప్పు అన్ని పెరిగాయి. బియ్యం ధరలు పెరిగాయి. దుస్తుల ధరపై వ్యాట్‌ భారం అదనంగా పడింది. దీంతో ధరలు పెరిగాయి. పెళ్లంగటే సామాన్యులు భయపడిపోయే రోజులు వస్తున్నాయి. పాశ్చాత్య విషసంస్కృతి మోజులో ఆర్భాటాలకు వెళ్లి అనవసరంగా ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు చిక్కుకునే పరిస్థితి వచ్చింది. వీటి నుంచి ఎంత తొందరగా భయటపడితే అంత మేలు జరుగుతుంది.