ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం

C

– జనం మన్ననలు పొందండి

– విశ్వనగరంలో భాగస్వాములుకండి

– కార్పోరేటర్లకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):  గత ఎన్నికల్లో హైదరాబాద్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌ను నమ్మి విజయం కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు గట్టిగా కృషి చేయాల్సి ఉందని సిఎం కెసిఆర్‌ అన్నారు. గతంలో పాలన చేసిన టిడిపి, కాంగ్రెస్‌, ఎంఐంలను కాదని టిఆర్‌ఎస్‌ను గెలిపించారంటే అర్థం చేసుకోవాలన్నారు. మనపై కొత్త నమ్మకంతో ప్రజలు అధికారాన్నికట్టబెట్టారని గుర్తు పెట్టుకోకుంటే బండకేసి కొడతారని  హెచ్చరించారు. హైదరాబాద్‌ ప్రగతి రిసార్ట్స్‌లో కార్పోరేటర్లకు శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్బంగా సిఎం మాట్లాడుతూ హైదరాబాద్‌ అబివీద్ది లక్ష్యంగా ఓ విజన్‌తో కార్పోరేటర్లు ముందుకు సాగాలని, కూపస్థ మండూకాల్లో ఉండరాదన్నారు. కార్పోరేటర్లు సిటీ అంతా తిరిగి అవగాహన పెంచుకోవాలన్నారు. హైదరాబాద్‌ గతంలో ఎలా ఉండేది..ఇప్పుడెలా ఉంది.. ఇక ముందు ఎలా ఉండాలన్న ప్రణాళికతో భవిష్యత్‌ హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు.  హైదరాబాద్‌ నగరంలో కోటి జనాభాకు సరిపడ సౌకర్యాలు లేవు అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. నగరంలో మౌలిక వసతులు ఆశించినంతగా లేవు అన్నారు. కార్పొరేటర్లు ఆయా డివిజన్లలో తక్షణ ప్రాధాన్యాలు గుర్తించాలని సూచించారు. కార్పొరేటర్లందరూ సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ను పరిశీలించాలని ఆదేశించారు. కొత్త మార్కెట్ల నిర్మాణం ఇప్పటికే మొదలు పెట్టామని తెలిపారు. వాటిని పూర్తి చేసే బాధ్యత కార్పొరేటర్లు తీసుకోవాలన్నారు. ఇక సిటీలో బస్‌ టర్మినల్స్‌ ఎన్ని ఉండాలో ఆలోచించాలని చెప్పారు. ఒక క్రమపద్ధతిగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నింటికీ కార్పొరేటర్లు కృషి చేయాలని ఆదేశించారు. విూటింగ్‌లు పెట్టుకోవడం కాదు, లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. మంచి పనులు

చేస్తున్నామంటే ప్రశంసలు వస్తుంటాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం, అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తమనడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్‌ చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. ఈ విధంగా కార్పొరేటర్లు కూడా తమ డివిజన్లను అభివృద్ధి చేస్తే గొప్ప పేరు వస్తది, ప్రశంసలు వస్తాయన్నారు. ప్రతి కార్పొరేటర్‌ తన డివిజన్‌ను సొంత ఇంటిలా భావించి అభివృద్ధి చేయాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే అద్భుతాలు సాధించవచ్చు అన్నారు. హైదరాబాద్‌ నగరం మొత్తం మరో ప్రగతి రిసార్ట్స్‌ కావాలన్నారు. ఈ రిసార్ట్స్‌లో ఒక్క దోమ కూడా ఉండదు.  పచ్చదనంతో బాగా అందంగా తయారయ్యిందన్నారు. అలా హైదరాబాద్‌ నగరం తయారు కావాలన్నారు. ఎక్కడ చెట్లు ఉంటాయో.. అక్కడ కరువు ఉండదన్నారు. కెనడాలో మనిషికి 8 వేల 950 చెట్లు ఉన్నాయి, రష్యాలో మనిషికి 4,460, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉంటే ఇండియాలో మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రగతి రిసార్ట్స్‌లో మాత్రం మనిషికి 5 వేల చెట్లు ఉన్నాయని తెలిపారు. ఎంతటి వారైనా తెలియని విషయాలు తెలుసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.  అన్ని విషయాలు తెలుసుకుని ఎవరూ పుట్టరు అని చెప్పారు. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తనకు తెలియని పంచాయతీరాజ్‌ విషయాలను మిత్రులను అడిగి తెలుసుకున్నానని గుర్తు చేశారు. ఎన్‌ఐఆర్‌డీలో ప్రవేశం పొంది పంచాయతీరాజ్‌ గురించి తెలుసుకున్నానని తెలిపారు. బాగా పని చేసే ప్రజాప్రతినిధులకు అధికారులు కూడా చక్కగా సహకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసేందుకే కార్పొరేటర్లు అంకితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. శిక్షణా కార్యక్రమం చాలా ముఖ్యమైనదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అసాధారణ విజయం సాధించిందని తెలిపారు. తెలియని విషయాలు తెలుసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తే అధికారులు సహకరిస్తారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్న కేసీఆర్‌ అవినీతికి తావులేకుండా పనులు జరగాలని ఆకాంక్షించారు. ఇల్లు కట్టడానికి ఇసుక పోస్తే కార్పోరేటర్‌ మనుషులు అక్కడికి వెళ్లే దుస్తితి పోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి రిసార్ట్స్‌లో శిక్షణా తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ వారి విధులు, బాధ్యతల నిర్వహణపై సూచనలు చేశారు. సమావేశంలో స్వచ్ఛ హైదరాబాద్‌ – స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో బోధిస్తారు. తొలిరోజు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కి) నిపుణులు.. రిటైడ్‌ ¬ సెక్రటరీ పద్మనాభయ్య తదితరులు మాట్లాడారు. కార్పోరేటర్లు నరసింహావతారం ఎత్తాలి నగరంలోని పలు కాలనీలు దారుణాతిదారుణంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ను క్లీన్‌సీటీ చేయడం బ్రహ్మ విద్య కాదన్నారు. కార్పొరేటర్లు సిటీ అంతా తిరిగి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని, సమస్యలను పరిష్కారించాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీకి వచ్చే ప్రతీ రూపాయి నగరాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. బస్తీల బాగుకోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు అందరూ ఢిల్లీ, నాగపూర్‌ వంటి నగరాలను సందర్శించి.. అక్కడ అమలవుతున్న కార్యక్రమాలను నిశితంగా పరిశీలించాలన్నారు. నగర అభివృద్ధి కార్పొరేటర్లపైనే ఆధారపడి ఉందన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా పలు కాలనీల్లో తాను పర్యటించిన సమయంలో దారుణ పరిస్థితులు చూసినట్లు చెప్పారు. నగర ప్రజలు ఎలాంటి దుర్భర జీవితం అనుభవిస్తున్నారో తాను కళ్లారా చూశానన్నారు. అలాంటి పరిస్థితులను మార్చే అవకాశం కార్పోరేటర్లకు ఉందన్నారు. నగరాన్ని బాగు చేసేందుకు ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో వర్షం నీరు ప్రవహించే నాలాలు కబ్జాకు గురయ్యాయని కేసీఆర్‌ తెలిపారు. రోడ్లపై వర్షం నీరు నిల్వ లేకుండా చేసే పనులకు రూ.11వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాలు లేవన్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో అందుకు తగ్గట్లుగా పౌర సదుపాయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్లు బావిలో కప్పల్లా ఉండొద్దని కేసీఆర్‌ సూచించారు. కార్పోరేటర్లు తమ డివిజన్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లోని సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు.  పేదలు  డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు విన్నవించారు. ప్రభుత్వంపై నమ్మకంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం స్థలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో దళారుల వ్యవస్థను ప్రజలు, అధికారులు అంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా కార్పోరేటర్లు కృషి చేయాలని కేసీఆర్‌ సూచించారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చేయాలన్నారు. నగరానికి కొన్ని వందల మైళ్ల నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని… నీటి కొరత తీరాలంటే శాశ్వత మంచినీటి జలాశయం అత్యవసరమని అన్నారు. నగరంలో రెప్పపాటు కూడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గరంలో 3800 సిటీ బస్సులు తిరుగుతున్నా… అందుకు తగ్గట్లుగా బస్టాపులు లేవని కేసీఆర్‌ చెప్పారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నగర శివారులో రెండు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ నగరం ఎలా ఉండేది? ఎలా ఉంది? ఎలా ఉండబోతోంది? అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అభివృద్ధిలో భాగస్వాములు కావొచ్చన్నారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరాన్ని ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.ప్రజా జీవితంలో ఉన్నవారు తమకు తెలియని విషయాలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తనకు తెలియని పంచాయతీరాజ్‌ విషయాలను మిత్రులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. బాగా పనిచేసే ప్రజాప్రతినిధులకు అధికారులు కూడా చక్కగా సహకరిస్తారన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఉండే వారంతా హైదరాబాదీలేనని… అందులో తెలంగాణ, ఆంధ్రా అని విడదీసి చూడొద్దని కార్పోరేటర్లకు సూచించారు. తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రా ప్రజలకు భద్రత ఉండదని కొందరు దుష్పచ్రారం చేశారని… కానీ తెలంగాణ వచ్చాక ఒక్క ఆంధ్రా వ్యక్తిపైనా అయినా దాడి జరిగిందా? అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలు కూడా తెరాస ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టే జీహెచ్‌ఎంసీలో తెరాసకు 99 సీట్లు వచ్చాయన్నారు. ఈ నమ్మకాన్ని వమ్మచేయకుండా కృషి చేయాలన్నారు.