ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సిపిఐ పాదయాత్రలు

ఆదిలాబాద్‌, జూలై 21 : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్‌ ఆరోపించారు. మున్సిపల్‌ పరిధిలో వివిధ వార్డులలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శనివారం స్థానిక తిరుపల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలో సమస్యలు పేరుకుపోయాయని, వాటిని గుర్తించి పరిష్కార దిశగా ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకొని విన్నవించడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్థంగా మారి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నా ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఈ పాదయాత్రలు ఈ నెల 23 తేదీవరకు చేపట్టి సమస్యలను తెలుసుకొని అధికారులకు తెలియజేస్తామని అన్నారు. అదేవిధంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.