ప్రభుత్వ అసమర్థ వల్లే గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షం
హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి):
గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అఖిల పక్షం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మఖ్దూంభవన్‌లో సోమవారం వామపక్షాల నేతృత్వంలో అఖిలపక్ష పార్టీల నేతల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని సీపీఎం నేత బీవీ రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నా రాష్ట్రానికి గ్యాస్‌ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు దాసోహమవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నదని రాఘవులు విమర్శించారు. రాష్ట్రంలోని వనరులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని రాఘవులు ఆరోపిం చారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యా యంపై ఎక్కడికక్కడ మంత్రులను నిలదీయాలని రాఘవులు పిలుపునిచ్చారు. గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌ ఎదుట ధర్నా చేపట్టే అంశంపై కూడా నిర్ణయం తీసుకుం టామని రాఘవులు అన్నారు.
అనంతరం టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్ల విద్యుత్‌ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్రానికి దక్కే గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలు తన్నుకు పోతుంటే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.