ప్రభుత్వ చేతగానితనం వల్లే..విద్యుత్‌ కష్టాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు

విజయవాడ, జూలై 13 (: ప్రభుత్వ చేతగానితనం వల్లే విద్యుత్‌ సంక్షోభం రాష్ట్రంలో తలెత్తిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. నగరంలోని ట్రాన్స్‌కో ఎఇ కార్యాలయం ఎదుట శుక్రవారంనాడు సిపిఎం ధర్నా చేపట్టింది. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధర్నా నుద్దేశించి బీవీ రాఘవులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌ రేట్లను విపరీతంగా పెంచడమే గాక సర్‌చార్జిల పేరిట ప్రజలపై మరింత భారాన్ని ప్రభుత్వం మోపిందన్నారు. వారానికి మూడు రోజుల పాటు పరిశ్రమలకు పవర్‌ కట్‌ విధించడం వల్ల ఎన్నో లఘు పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందన్నారు. దీంతో ఎన్నో వేలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పారు. సామాన్యుల, మధ్యతరగతి ప్రజల కష్టాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా పర్యటనలకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, మంత్రులను నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.