ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి):
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఇంకొంత కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఉంచేవాడు కాదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష నాయకులు ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బిడిఎల్‌)లో తెలంగాణ ఉద్యోగ సంఘం ఆవిర్భావ సదస్సు తెలంగాణ భవన్‌లో ఆదివారంనాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకునేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ట్రేడ్‌ యూనియన్లలోకి ప్రవేశించిందన్నారు. ప్రపంచానికి వెలుగునిచ్చే సింగరేణి సంస్థలో తెరాస అనుబంధ సంఘం విజయం సాధించడం ఒక గొప్ప పరిణామమన్నారు. తెలంగాణలో అతి విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీపరం చేసింది చంద్రబాబేనని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ వంటి సంస్థలను ప్రైవేటుపరం చేసి తెలంగాణకు చెందిన ఎంతో మంది బిడ్డలను రోడ్డుపైకి ఎక్కించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. బీడీఎల్‌, ఐడిపిఎల్‌, బిహెచ్‌ఇఎల్‌ వంటి సంస్థలు తెలంగాణ పట్టుకొమ్మలని, అవి తెలంగాణ ప్రాంతానికే చెందినవని అన్నారు. అటువంటి సంస్థలను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌ తన కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు తెలంగాణను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములనే కాకుండా దళిత, గిరిజన, బీసీల భూములను కూడా స్వాధీనం చేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు తన అనుయాయులకు కట్టబెట్టాడంటూ ఈటెల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సకల సమస్యలకు పరిష్కారం తప్ప మరొకటి కాదన్నారు. తెలంగాణ సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని, ఎంతటి త్యాగాలకైనా సిద్ధమవుతా మని ఆయన హామీ ఇచ్చారు. బిడిఎల్‌ ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.