ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించండి
– కేంద్రమంత్రులతో హరీశ్ బృందం భేటి
– సానుకూలంగా స్పందించిన కేంద్రం
న్యూఢిల్లీ,మే11(జనంసాక్షి):: గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర సహాయ సహాకారాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానిని జాతీయప్రాజెక్టుగా గుర్తించి సాయం చేయాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేసిన మరునాడే గోదావరి ప్రాజెక్టుల ప్రతిపాదనను కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెల్లారు. ఈ మేరకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారాంతో మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్ సమావేశమయ్యారు. రెండు రాష్టాల్ర మధ్య నిర్మించే ప్రాజెక్టులపై చర్చ జరిగిందని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అంగీకారం కుదిరిందని అన్నారు. గోదావరిపై నిర్మించే తమ్మిడిహట్టి, ప్రాణహిత నదిపై నిర్మించే మేడిగడ్డ, పెనుగంగ ఉపనదిపై నిర్మించే ప్రాజెక్టులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంపై సానుకూలంగా ఉంది. నీటి ప్రాజెక్టుల వల్ల మహారాష్ట్రలో ఏ ప్రాంతమూ ముంపుకు గురికావడం లేదన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నిర్మించే ప్రాజెక్టుల గురించి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించినట్లు వెల్లడించారు. సముద్రంలో వృథాగా కలిసే నీరు రైతులకు ఉపయోగపడాలనే యోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది. కృష్ణాట్రిబ్యునల్‌లో తెలంగాణ న్యాయవాదులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. కేంద్రం నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు త్వరగా విడుదల చేస్తే ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని హరీశ్‌రావు తెలిపారు. నీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని హరీశ్‌రావు హితవు పలికారు. ఇదిలావుంటే మేడిగడ్డ బ్యారేజీ పై తెలంగాణ, మహారాష్ట్రరాష్టాల్ర మధ్య చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్ లో త్వరలో జరిగే గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి రావలసిందిగా మహా రాష్ట్ర సీఎం ఫడ్న వీస్ ను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ఇందుకు ఫడ్న వీస్ సానుకూలంగా స్పందించారు. ముంబైలో మంగళవారం నాడు మహారాష్ట్ర సీఎం ఫడ్న వీస్ ను హరీష్ రావు కలిసి తాజా అంవాలను చర్చించారు. గోదావరి ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశం తేదీ నిర్ణయించాలని హరీష్ రావు కోరారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు,ప్లాన్లు, సాంకేతిక వివరాలపై రెండు రాష్టాల్ర సెంట్రల్ డిజైను ఆర్గనైజేషన్స్(సిడివో) ఇంజనీర్లు ఫైనలైజ్ చేస్తారు. తర్వాత జరిగే గోదావరి అంతర రాష్ట్ర బోర్డు అపెక్స్ కమిటీ సమావేశానికి సిడిఓ ల నివేదిక ప్రాతిపదిక కానున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్ట్రకు ముంపు సమస్య లేదని ఇరిగేషన్ మంత్రి హరీష్, మహారాష్ట్ర మంత్రికి వివరించారు.తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు కు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దులలో కేవలం 55 హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతున్నట్లు రెండు రాష్ట్రల మంత్రులు నిర్ధారించుకున్నారు. అతి తక్కువ ముంపుతోనే ప్రాజెక్టులు నిర్మించాలని కెసిఆర్ సంకల్పించినట్టు టి.ఎస్. భారీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. ఈ వాదనతో మహారాష్ట్ర కూడా ఏకీభవించింది. సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో ప్రాంతానికో విధానం, రాష్టాన్రికో సిధాంతాన్ని కాంగ్రెస్ అవలంబిస్తున్నట్టు ఇద్దరు మంత్రులు ఆరోపించారు. 2015 ఫిబ్రవరి 17న సీఎం కెసిఆర్ మొదటిసారిగా ముంబయి వెళ్ళి ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో చర్చించారు. 2016 మార్చి 8న మరోసారి ఇద్దరు సీఎంల సమావేశమయ్యారు. మహారాష్ట్రలో లాలూచీ పడ్డామని, చీకటి ఒప్పందం చేసుకున్నామంటూ జరుగుతున్న విష ప్రచారాన్ని మంత్రి హరీష్ తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర, తెలంగాణ సంయుక్తంగా లైడార్
సర్వేలు నిర్వహించిన తర్వాతే ప్రాజెక్టులను రెండు రాష్టాల్రు అవగాహనతో నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్ చేసి బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. కాగా నిజామాబాద్ జిల్లా లోని లెండి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని హరీష్ కోరారు. మహారాష్ట్ర సానుకూలంగా స్పందించింది. ఈ వివరాలను మంత్రుల బృందం మరోమారుకేంద్రమంత్రితో చర్చించారు. నిధులు కేటాయించి ఆదుకోవాలన్నారు.