మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?

 

 

 

 

 

30అక్టోబర్ జనంసాక్షి :హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్‌లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్ర‌శ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా? అని నిల‌దీశారు. హ‌నుమ‌కొండ‌, జులైవాడ‌లో భారీగా కురిసిన వ‌ర్షానికి నీట మునిగిన కాల‌నీలతో పాటు అమరావతి నగర్, సమ్మయ్య నగర్, 100 ఫీట్ రోడ్డులో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద‌ ఉదృతిని గ్రేటర్ వరంగల్ అధికారులతో కలిసి రాకేశ్ రెడ్డి పరిశీలించి, పలు సూచనలు చేయడం జరిగింది.

ఈ సంద‌ర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మొంథా వరద బీభత్సంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని అనేక కాలనీలు నీటి మునిగి, నగరం జల దిగ్బంధం అయింది. నిత్యావసర వస్తువులు సహా, విలువైన టీవీ, బీరువాలు సైతం నీట మిగిని ఆస్తి నష్టం వాటిల్లింది. వృద్ధులు, వికలాంగులు, బాలింతలు రాత్రంతా నీటమునిగిన ఇళ్లల్లోనే గడిపారు. తుఫాన్ తీవ్రతను ముందస్తుగా గ్రహించి అంచనా వేయడంలో, ప్రజలను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. త‌క్షణమే నీటి మునిగిన ప్రాంతాల్లో ఆస్తి నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి అని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

సమ్మయ్య నగర్ పూర్తిగా నీట మునిగి ప్రజలు సర్వం కోల్పోవడం జరిగింది. ఆవులు, గేదెలు, పశువులు అరుస్తూ వరదల్లో కొట్టుకుపోవడం తీవ్రంగా కలిచివేసింది. ఆస్తి నష్టంతో పాటు పశు పక్షాదుల ప్రాణ నష్టం కూడా భారీగా వాటిల్లే ప్రమాదం ఉంది. మొంథా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ముందస్తు చర్యలేవి? ఈ సమయంలో ఒక్క జిల్లాకు ఒక్కో మంత్రి ఇంచార్జీగా ఉండి.. వరద ప్రాంత ప్రజలకు రక్షణగా ఉండాలి. కానీ జూబ్లీహిల్స్‌లో ఒక్కో మంత్రి ఒక్కో డివిజన్‌కు ఇంచార్జిగా ఉన్నార‌ని రాకేశ్ రెడ్డి మండిప‌డ్డారు.