బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో ఓ పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉండగా,అమలుపై అనిశ్చితి కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అమలు జరగకపోతే భవిష్యత్ తరాల బీసీ ప్రజలు దారుణమైన ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘‘బీసీ ఉద్యమం’’ కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాకుండా, సామాజిక సమానత్వం కోసం సాగే సామాజిక పోరాటంగా మారింది. ఈ పోరాటంలో వచ్చిన చిక్కంతా బీసీ నేతలు కలిసి పని చేయకపోవడమే. ఇక్కడ ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయా నేతలు తమదైన దారిలో బీసీల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అందుకే వీరంతా వీలైనంత త్వరగా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో మూడు వేర్వేరు జేఏసీలు బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ పేరుతో ఏర్పడ్డాయి. మొదటిది ఎంపీ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ జేఏసీ, రెండవది మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య, చిరంజీవులు తదితరులతో ఉన్న బీసీ సాధికారత జేఏసీ, మరొకటి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి నేతృత్వంలోని బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ. ఇందులో సంచార, అర్థసంచార కులాలు, వృత్తి ఆధారిత సంఘాలు, మేధావులు, న్యాయవాదులు భాగమయ్యాయి. వీరందరి లక్ష్యం ఒకటే.. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించడం. మార్గాలు వేర్వేరు కావడంతో ఐక్యతలో లోపం వచ్చింది. ఉమ్మడి తెలంగాణ ఉద్యమంలా ‘‘సమిష్టి కార్యచరణ’’ జరగకపోతే ఈ పోరాటం బలహీనమవుతుందనే భయం మేధావుల్లో పెరుగుతోంది.
నిస్వార్థ సేవతో దుండ్ర కుమారస్వామికి గుర్తింపు : జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తనదైన శైలిలో పోరాటం చేస్తూ ఉన్నారు. కుమారస్వామి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రముఖ బీసీ నాయకుడు. కష్టం ఉందంటూ ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకుని వెళ్లడం ఆయనకు అలవాటు. అణగారిన వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు (బీసీలు) సాధికారత కల్పించడానికి జీవితాంతం అంకితభావంతో పని చేస్తూ గుర్తింపు పొందారు. అవిశ్రాంత సేవ, నిస్వార్థ సేవతో గుర్తింపు సొంతం చేసుకున్న విద్యావేత్త దుండ్ర కుమారస్వామి. నేటి రాజకీయాల్లోని చాలా మందికి భిన్నంగా, కుమారస్వామి అధికారం కంటే భావజాలంతో బీసీ దళ్ ను నడిపిస్తూ ఉన్నారు. అన్ని రంగాలలో బీసీలకు సమాన ప్రాతినిధ్యం, అవకాశాలు ఉన్న సమాజం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
పార్టీలకతీతంగా పోరాటం : కొందరు బీసీ నేతలు పదవులు రాగానే సిద్ధాంతాలను గాలికి వదిలేస్తూ ఉంటారు. కానీ దుండ్ర కుమారస్వామి అలాంటి వ్యక్తి కానే కాదు. బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత వివక్ష గురించి కుమారస్వామికి అవగాహన పెరుగుతున్న చిన్న వయసులోనే, వారి హక్కుల కోసం వాదించడం తన బాధ్యతగా భావించాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2015లో, ఆయన జాతీయ బీసీ దళ్ అనే సంస్థను స్థాపించారు. ఇది బిసి వర్గాలలో నాయకత్వం, అభివృద్ధిని పెంపొందించడానికి, అవగాహనను ప్రోత్సహించడానికి పోరాటం చేసే సంకల్పంతో ముందుకు వచ్చింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయవాదిగా ఆయన
అనుభవం అన్యాయాలను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన మద్దతును అందించడానికి, బీసీ వర్గాలకు మరింత సమర్థవంతంగా సేవ చేసే సామర్థ్యాన్ని పెంచడానికి వీలు కల్పించింది. రిజర్వేషన్ల పెంపు, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ మరియు వివిధ రంగాలలో బీసీల ప్రాతినిధ్యం కోసం వాదించే ‘‘బీసీ ధర్మ పోరాట’’కు కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, సమాజ నాయకులు మరియు కార్యకర్తలను నిర్వహించడం ద్వారా, సమాజంలో బీసీలు తమ సరైన స్థానాన్ని కోరుకునే వేదికను ఆయన సృష్టించారు.
బీసీ ఉద్యమం ఇప్పుడు కేవలం రాజకీయ ప్రక్రియ కాదు, ఇది సామాజిక న్యాయం కోసం చేస్తున్న యుద్ధం. జేఏసీల మధ్య భేదాలు సహజమే అయినా, సిద్ధాంతం ఒకటే అని గుర్తించాలి. ముఖ్యంగా రిజర్వేషన్ల సాధన, రాజ్యాధికార సాధన వైపు బీసీ నేతలంతా అడుగులు వేయాలి. బీసీలు ఐక్యమైతే, కేంద్రం కూడా తలవంచాల్సిందే. బీసీ ఉద్యమ ఉప్పెనను కేంద్ర ప్రభుత్వం అరచేతితో ఆపలేదు. అదే ప్రశ్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి అడిగే నాయకులు చాలా తక్కువ, సమాజమే తన కుటుంబం అని అనుకునే నాయకులు మరింత అరుదు. వారంతా కలిస్తేనే బీసీ నేతల లక్ష్యాలు సాకారమవుతాయి.



