బావిలో పడి బాలుడు మృతి

కడప, జూలై 26: బావిగట్టున ఉన్న పిచ్చికగూటికోసం ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి ఒక బాలుడు మృతి చెందాడు. గోపవరం మండలం భూమిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూమిరెడ్డిపల్లికి చెందిన రఘురామ్‌రెడ్డి (7), వంశి (7), మరో ఇరువురు పిల్లలు ఆడుకునేందుకు గ్రామ పొలిమేరలకు వెళ్లారు. అక్కడ ఒక బావి ఒడ్డిన చెట్టుకు ఉన్న పిచ్చుకగూళ్లను పట్టుకునేందుకు రఘురామ్‌రెడ్డి, వంశి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు వారిరువురు బావిలో పడ్డారు. ఒడ్డున ఉన్న వారు కేకలు వేయడంతో గ్రామస్తులు వారిని ఒడ్డుకు చేర్చారు. అయితే రఘురామ్‌రెడ్డి అప్పటికే మృతి చెందాడు. ఈ ప్రమాదం నుండి వంశి సురక్షితంగా బయటపడ్డాడు. మృతుడు రఘురామ్‌రెడ్డి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. ఈ సంఘటనపై గోపవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.