బై బై క్లియస్టర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన బెల్జియం భామ

న్యూయార్క్‌ ,ఆగష్ట్‌ 30 : మూడు సార్లు యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన బెల్జియం టెన్నిస్‌ క్రీడాకారిణి కిమ్‌ క్లియస్టర్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం జరుగుతోన్న యుఎస్‌ ఓపెన్‌ తన కెరీర్‌లో చివరి టోర్నీగా ముందే చెప్పిన క్లియస్టర్స్‌ రెండో రౌండ్‌లో ఓడిపోయింది. బ్రిటన్‌ టీనేజర్‌ రాబ్సన్‌ 7-6 , 7-6 తేడాతో ఈ మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చింది. మ్యాచ్‌ ముగిసిన వెంటనే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుండి వైదొలుగుతున్నట్టు కిమ్‌ ప్రకటించింది. 29 ఏళ్ళ క్లియస్టర్స్‌ ఇప్పటి వరకూ నాలుగు గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్ళు గెలుచుకుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉంది. ఈ బెల్జియం క్రీడాకారిణి రిటైర్మెంట్‌ ప్రకటించడం ఇది రెండోసారి. 2007లో వరుస గాయాల కారణంగా ఆట నుండి తప్పుకుంది. ఏడాది తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈ మాజీ నెంబర్‌ వన్‌ 2009లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. పునరాగమనం చేసిన ఏడాదిలోనే యుఎస్‌ ఓపెన్‌ గెలిచి సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. గ్రాండ్‌శ్లామ్‌ గెలిచిన తల్లిగా రికార్డులకెక్కింది. 2010లోనూ అదే జోరు కొనసాగించిన క్లియస్టర్స్‌ మళ్ళీ యుఎస్‌ ఓపెన్‌ నిలబెట్టుకుంది. ఇలా వరుసగా రెండేళ్ళు గ్రాండ్‌శ్లామ్స్‌ గెలిచిన తల్లిగా చరిత్ర సృష్టించింది. యుఎస్‌ ఓపెన్‌తో తనకు ఎనలేని అనుబంధం ఉందని , కెరీర్‌లో మూడు గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్స్‌ ఇక్కడే గెలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంది.రిటైర్మెంట్‌ మళ్ళీ సరైన సమయంలోనే ప్రకటించినట్టు భావిస్తున్నానని , కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు తీరిక దొరికిందని వ్యాఖ్యానించింది. రీ ఎంట్రీ తర్వాత రెండేళ్ళు ఆడతానని అనుకోలేదని కిమ్‌ తెలిపింది. క్లియస్టర్స్‌ కెరీర్‌లో పలువురు టాపా ప్లేయర్స్‌పై విజయాలు సాధించిన నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. జస్టిన్‌ హెనిన్‌తో 12 ఏళ్ళలో 25 సార్లు తలపడిన క్లియస్టర్స్‌ 13-12తో గెలుపు రికార్డు నమోదు చేసింది. 2003లో ఏడాది పాటు నెంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్న క్లియస్టర్స్‌ డబుల్స్‌లోనూ అగ్రస్థానం సాధించింది. డబుల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి సుగియామాతో జత కట్టిన బెల్జియం భామ 2003 లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ , వింబుల్డన్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. ఇటీవల లండన్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకూ చేరుకుంది.
క్లియస్టర్స్‌ కెరీర్‌ రికార్డ్‌ ః
ఆస్టేల్రియన్‌ ఓపెన్‌ – ఛాంపియన్‌ – 2011
ఫ్రెంచ్‌ ఓపెన్‌ – రన్నరప్‌ – 2001 , 2003
వింబుల్డన్‌ – సెవిూఫైనలిస్ట్‌ – 2003 , 2006
యుఎస్‌ ఓపెన్‌ – ఛాంపియన్‌ – 2005 , 2009 , 2010
డబుల్స్‌ రికార్డ్‌ ః 131-54
ఆస్టేల్రియన్‌ ఓపెన్‌ – క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ – 2003
ఫ్రెంచ్‌ ఓపెన్‌ – ఛాంపియన్‌ – 2003
వింబుల్డన్‌ – ఛాంపియన్‌ – 2003
యుఎస్‌ ఓపెన్‌ – క్వార్టర్‌ ఫైనలిస్ట్‌ – 2002
కెరీర్‌ టైటిల్స్‌ – 11 డబ్ల్యూటిఎ , 3 ఐటిఎఫ్‌
మిక్సిడ్‌ డబుల్స్‌ రికార్డ్‌ – వింబుల్డన్‌ రన్నరప్‌ – 2000