బొగ్గుగనుల కేటాయింపు వల్ల ప్రభుత్వానికి

నష్టమని ‘కాగ్‌’ చెప్పలేదు : ఖుర్షీద్‌
కోల్‌గేట్‌పై అవసరమైతే రాజ్యాంగ సవరణ
గులాంనబీ ఆజాద్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించలేదని కేంద్రన్యాయశాఖామంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. కోల్‌ బ్లాక్‌ల వేలానికి ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రులు ఖుర్షీద్‌, గులాంనబీ ఆజాద్‌ సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఖర్షీద్‌ మాట్లాడుతూ బొగ్గు కేటాయింపులపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా ఈ కేటాయింపుల్లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చినట్టు కాగ్‌ నివేదిక వెల్లడించలేదని ఖుర్షిద్‌ అన్నారు. బొగ్గు గనుల వేలంలో ఎంత వస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరని ఆయన అన్నారు. ఖజానాకు నష్టం వచ్చే రీతిలో ప్రభుత్వం ఎక్కడా వ్యవహరించలేదని ఖుర్షీద్‌ అన్నారు. బొగ్గు గనులను ప్రభుత్వం వేలం వేయలేదని, కేవలం విద్యుత్‌ కేంద్రాలకు గనుల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఖనిజాల వేలానికి పటిష్టమైన చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. దేశంలో అభివృద్ధికి ఆటంకం కలగవద్దనే ఉద్దేశంతో సిమెంట్‌, స్టీల్‌ పరిశ్రమలకు బొగ్గు కేటాయింపులు జరిగాయని చెప్పారు. స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన విధివిధానా లను అనుసరించే బొగ్గు కేటాయింపులు జరిగాయని, ఇందులో ఎవరి జోక్యం లేదని అన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకే బీజేపీ పార్లమెంట్‌ సమావేశాలను దుర్వినియోగపరిచిందన్నారు. ప్రజలను బిజెపి తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. అనంతరం గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ అవసరమైతే కోల్‌ గేట్లకు రాజ్యాంగ సవరణ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కాగ్‌ నివేదికను బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి నష్టం జరిగిందని కాగ్‌ నివేదికలో ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పార్లమెంట్‌ సమావేశాలను బీజేపీ
అడ్డుకుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సరైన వేదికలు చట్టసభలని, వాటిపై బీజేపీకి గౌరవం, నమ్మకం లేదని ఆజాద్‌ విమర్శించారు. బొగ్గు కేటాయింపులపై అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా జరుపుతామని, విధి విధానాలకు అనుగుణంగానే కేటాయింపులు జరిగాయని ఆజాద్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి బాగానే ఉందని ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌లను మార్చే ఉద్దేశం అధిష్టానానికి లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని పరిస్థితులను పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తున్నదని ఆజాద్‌ తెలిపారు.