బోథ్‌లో ముక్కోణపు పోటీ

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రసవత్తర పోరు
ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఎంపీ సోయం బాపు
లంబాడా ఓట్లు కీలకం కావడంతో అభ్యర్థుల ప్రచారం
మరోమారు బీఆర్‌ఎస్‌ నుంచి అనిల్‌ జాదవ్‌
ఆదిలాబాద్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : ఎస్టీ రిజర్వుడుగా ఉన్న బోథ్‌ నియోజకవర్గం లోగట్టిపోటీ నెలకొంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోటీలో లేకపోవడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపు రావుకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీలోకి వెళ్లారు. ఆయన స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌ కు బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కింది. బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సోయం బాపు రావు అనూహ్యంగా అసెంబ్లీ బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి మొదట అశోక్‌ కు టికెట్‌ కేటాయించిన పార్టీ హైకమాండ్‌ తర్వాత అభ్యర్థిని మార్చి లంబాడ సామాజికవర్గానికి చెందిన ఆడె గజేందర్‌ కు టికెట్‌ ఇచ్చింది. దీంతో అటు పార్టీల పరంగా, ఇటు సామాజికవర్గాల పరంగా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బోథ్‌ నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో ఆదివాసీ ఓటర్లు కచ్చితంగా ప్రభావం చూపుతారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఆదివాసీ నేతలను ఎన్నుకునేందుకు తీర్మానాలు చేశారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ సోయం బాపు రావు.. తమ సామాజికవర్గం ఓట్లతో పాటు ఎమ్మెల్యే రాథోడ్‌ బాపు రావు వర్గం మద్దతు కూడా లభిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో క్యాడర్‌ అంతగా లేకపోయినా తన సామాజికవర్గం ఓట్లతో పాటు ప్రస్తుతం ఎంపీగా ఉండడం సోయంకు కలిసొచ్చే అంశం. ఇక్కడ ఆదివాసీ లీడర్లు తొడసం ధనలక్ష్మి,
బీఎస్పీ నుంచి మేస్రం జంగు బాపు, ధర్మ సమాజ్‌ పార్టీ నుంచి ఉయిక ఉమేశ్‌ ఇండిపెండెంట్‌ గా పోటీలో చేస్తున్నారు. దీంతో ఆదివాసీల ఓట్లు కొంత మేరకు చీలే అవకాశం ఉంది. గిరిజనేతరులతో పాటు మైనారిటీ ఓటర్లు సైతం బీజేపీకి ప్రతికూలంగా మారనున్నారు. సోయం బాపురావు 2009 నుంచి ఇక్కడ ఓడిపోతూ వస్తున్నారు. 2004లో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆయన ఎప్పుడూ గెలవలేదు. 2018లోనూ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలిచారు. లంబాడ సామాజికవర్గం ఓట్లు ఈసారి చీలే అవకాశం ఉంది. బీజేపీకి ఎమ్మెల్యే రాథోడ్‌ బాపు రావు మద్దతు ఉండడం, అటు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆడే గజేందర్‌ సైతం అదే సామాజికవర్గం నుంచి రావడంతో ఈ వర్గం ఓట్లు మూడు పార్టీలు పంచుకునే అవకాశం ఉంది. నేరడిగొండ, బోథ్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ మండలాల్లో అనిల్‌ కు క్యాడర్‌ ఉన్నప్పటికీ తలమడుగు, తాంసి, భీంపూర్‌ లో క్యాడర్‌ అంత బలంగా లేదు. ఇటీవల ఈ రెండు మండలాల్లో పట్టున్న సీనియర్‌ నేత, ఉద్యమకారుడు లోక భూమారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మొదటిసారి ఆడే గజేందర్‌ బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆయన.. 2019లో కాంగ్రెస్‌ లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు న్నారు. అన్ని మండలాల్లో పార్టీ క్యాడర్‌ బలంగానే కనిపిస్తోంది. బోథ్‌ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌ వరుసగా గెలిచింది. ఆ తర్వాత 1999 వరకు టీడీపీ వరుసగా విజయాలు అందుకుంది. అయితే ఓడిన సమయాల్లో కూడా ప్రతిసారి కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. 2018 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ కు 54 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆడే గజేందర్‌ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో పాటు ఆ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుతో పాటు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌ కు పడవచ్చని ఆ పార్టీ లీడర్లు ధీమాగా ఉన్నారు. అటు తమ సామాజికవర్గం లంబాడ ఓట్లు సైతం తనకు దక్కుతాయని గజేందర్‌ నమ్మకంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లలో అత్యధికంగా ఆదివాసీ ఓటర్లు దాదాపు 48 వేలకు పైగా ఉన్నారు. లంబాడ సామాజికవర్గం ఓట్లు 28 వేల వరకు ఉండవచ్చు. బోథ్‌ నియోజకవర్గం 1962లో ఏర్పడగా అత్యధికంగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఐదేసీ మార్లు గెలిచాయి. 2004, 2014, 2018 లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి కూడా అనిల్‌ జాదవ్‌ తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. 2009, 2014 లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన అనిల్‌ జాదవ్‌.. 2018లో టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌ గా పోటీచేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌ లో చేరి నేరడిగొండ జడ్పీటీసీగా గెలిచారు. ఈసారి ఏకంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని కేటీఆర్‌ అండతో బీఆర్‌ఎస్‌ టికెట్‌ సంపాదించి బరిలో నిలిచారు. అధికార పార్టీ టికెట్‌ దక్కడంతో పాటు గతంలో కాంగ్రెస్‌ లో ఉండడం, సొంత వర్గం తనకు అనుకూలించే అంశం. లంబాడా సామాజికవర్గం ఓట్లు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు తన వైపే ఉన్నారని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే, అనిల్‌ జాదవ్‌ కు అసంతృప్తుల బెడదతో పాటు ప్రతిపక్షాల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది.