భూ సమస్యలు పరిష్కరించండి

కడప, జూలై 27: జిల్లాలో దళిత బహుజనుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దళిత ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనోహర్‌ డిమాండు చేశారు. జిల్లాలో దళిత బహుజనులు భూ సమస్యలు రేషన్‌కార్డులు, బ్యాంకు రుణాలు, ఇతర సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వర్గాలకు చెందిన వారిని నెలల తరబడి తమ చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. అలా చేయని పక్షంలో దళిత బహుజనులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.