మంథని ఆర్డీవో ఆఫీస్ ముందు చందనపూర్ ఎస్సి కాలనీ భూనిర్వాసితుల ధర్నా

 

 

 

 

జనంసాక్షి , మంథని :
సింగరేణి ప్రభావిత గ్రామమైన రామగిరి మండలం చందనాపూర్‌ ఎస్సీ కాలనీ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించడంలో కాలయాపన చేస్తూ ఊరు ఖాళీ చేయమంటున్నారని చందనాపూర్‌ ఎస్సీ కాలనీ నిర్వాసితులు మంథని ఆర్డీవో ఆపీసు ఎదుట బుధవారం ధర్నా చేసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంథని ఆర్డీవో కు వినతిపత్రం అందించారు. సింగరేణి ప్రభావిత గ్రామమైన చందనాపూర్ ఎస్సీ కాలనీని 2008లో సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అప్పటి నుండి తమ ఇంటి స్థలాల పరిహారం పూర్తి మొత్తంలో చెల్లించలేదని, అలాగే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల విషయంలో అనేక మంది పేర్లు మిస్‌ అయ్యాయని తెలిపారు. సర్వం కోల్పోయిన తమకు పూర్తి స్థాయిలో నష్ట పరిహరం చెల్లించకుండా ఊరిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఎస్సీ కాలనీకి విద్యుత్‌, నీటి సదుపాయాలు నిలిపివేస్తామని సింగరేణి అధికారులు హెచ్చిరిస్తున్నటు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తిస్థాయిలో పరిహరంలో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో మిస్‌ అయిన పేర్లను పరిశీలించి ఇంటి అడుగు స్థలానికి బదులుగా బిట్టువల్లి ఆర్‌అండ్‌ కాలనీలో కుటుంబానికి ఒక ప్లాట్ చొప్పున ఇప్పించాలని, అలాగే 18 ఏండ్లు నిండిన యువతి యువకులకు అక్కేపల్లి, రచ్చపల్లి, అడ్రియాల,లద్నాపూర్ గ్రామాలకు ఇచ్చినట్లుగానే ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని కోరారు. కాలనీ ఏర్పాటుకు ఒకే చోట స్థలం కొనుగోలు చేశామని, ఆ స్థలానికి అతి సమీపంలో వాగు ఉండటం మూలంగా వర్షాకాలంలో ఆ స్థలం నీట మునుగుతుందని, ఆ స్థలానికి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు సమానంగా మట్టి పోయించాలని, అలాగే విద్యుత్, నీటి సదుపాయం కల్పించాలని వారు కోరారు. ఈ సదుపాయలు కల్పించిన వెంటనే కాలనీ ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓకు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ దాసరి శంకర్‌, మాజీ ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, మాజీ ఉపసర్పంచ్‌ కొండ శ్రీనివాస్‌, వార్డు సభ్యలు రాజు, సంతోష్‌, గ్రామస్తులు చంద్రయ్య, సునీత, రాజేశ్వరి, కనకమ్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.