మరోమారు విమోచన సభకు బిజెపి ప్లాన్?
హైదరాబాద్,సెప్టెంబర్1(జనం సాక్షి): తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి తమ సత్తా చాటాలని బిజెపి యోచిస్తోంది. ముందస్తు సంకేతాలు రావండంతో పాటు, ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సూచనల నేపథ్యంలో బిజెపి సన్నదందం అవుతోంది. ఇందులో భాగంగా 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సూచనప్రాయంగా పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా వేడుకలను నిర్వహిస్తామన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకొని వారికి ఘన నివాళి అర్పించనున్నట్లు తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టడంతో ఇప్పుడు బిజెపి దీనిని పెద్ద ఎత్తున చేపట్టి ఇరుకున పెట్టాలని చూస్తోంది. అలాగే రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకునే వారికి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు సమాచారం. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి బలైపోయిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. మజ్లీస్ పార్టీ నేతల తీరును తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. భాజపా కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేది వరకు భాజపా నాయకులు, అభిమానులు యాత్రను కొనసాగించాలన్నారు. గతేడాది కూడా తిరంగాయాత్రతో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.



