మర్లబడ్డ పర్లపల్లి తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజం

– సీమాంధ్ర సర్కారు తెలంగాణను రసాయనాల ప్రయోగశాలగా మార్చేసింది
– వ్యర్థ పదార్థాలను జనావాసాల మధ్య వేస్తున్నారు
– ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజం
– గోడు వెల్లబోసుకున్న గ్రామస్తులు
– శ్రద్ధగా ఆలకించిన టీజేఏసీ చైర్మన్‌
– కంపెనీని శాశ్వతంగా మూసేసి, పరిహారం అందిచాలని డిమాండ్‌

కరీంనగర్‌ : తమకు జరుగుతున్న అన్యాయానికి పర్లపల్లి గ్రామస్తులు మర్లవడ్డ తీరు తెలంగాణ ఉద్యమానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కొనియాడారు. సీమాంధ్ర సర్కారు తెలంగాణ ప్రాంతాన్ని రసాయనాలు పరీక్షించేందుకు ప్రయోగశాలలా వాడుకుంటున్నదని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో హరిత బయోప్రొడక్ట్స్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించిన పర్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. కంపెనీ వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరిత బయోప్రొడక్ట్స్‌ కంపెనీ వల్ల 9 గ్రామాలు నష్టపోగా, 20 మంది గర్భిణులు తమ గర్భాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. కంపెనీ వ్యర్థాలను జనావాసాల మధ్య పారేయడం వల్లనే ఇంత నష్టం జరిగిందని ఆరోపించారు. వెంకటి అనే యువకుడు ధర్నా సమయంలో కంపెనీ వదిలిన గ్యాస్‌ వల్ల ఊపిరాడక మృతి చెందాడని, దీనికి కంపెనీ, ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆ యువకుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామస్తులు తమ గోడును కోదండరాంకు వెల్లబోసుకున్నారు. వారి బాధలు విన్న ఆయన కంపెనీ వెదజల్లిన కాలుష్యం వల్ల చర్మ వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులను పరిశీలించి, గ్రామంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందజేయాలని డిమాండ్‌ చేశారు. పర్యావరణ శాఖ అధికారులు ఏమాత్రం పరిశీలించకుండా కంపెనీకి అనుమతులివ్వడం వల్లనే పర్లపల్లి ఇంతగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పర్లపల్లిని ఆదుకోవాలని, కంపెనీ బాధితులకు ఆర్థికంగా, వైద్యపరంగా సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పర్లపల్లి గ్రామస్తులను అభినందించిన ఆయన పర్లపల్లివాసులు చేసిన పోరాటంతో కాలుష్య నియంత్రణ మండలిలో చలనం వచ్చి, 12 ఫార్మా కంపెనీలను మూసివేయించే దిశగా చర్యలు తీసుకుందన్నారు. ఈ ఘనత పర్లపల్లి పోరాటానికే దక్కుతుందన్నారు. పర్లపల్లి గ్రామస్తుల ఉద్యమతీరును ఆదర్శంగా తీసుకుని తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలతో ఆశించిన ఫలితాలు సాధ్యమని కోదండరాం పర్లపల్లి పోరాటాన్ని ఉదహరించారు.