మహా ఉద్యమానికి వ్యూహ రచన

హైదరాబాద్‌,12 జూన్‌ (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా ఉద్యమం చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. మహా ఉద్యమం ఎలా ఉండాలనే విషయంపై వ్యూహ రచన చేసేందుకు ఆయన బుధవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, జర్నలిస్టు, ఎనలిస్ట్‌ కే.కేశవరావుతో భేటీ అయ్యారు. వీరి మధ్య ఉద్యమ రూపంపై సుదీర్ఘం చర్చ సాగింది. ఉప ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితులను తెలంగాణకు అనుకూలంగా మల్చుకుంటూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలన్న నిర్ణయానికి ఇరువురు వచ్చారు. భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఇక రాజకీయపార్టీలు తెలంగాణ వెంటే నిలబడక తప్పదన్నారు. తాడో పేడో దిశగా తెలంగాణ ఉద్యమం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు.