మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి: మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: దేశంలో మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్నారు. పోషకాహారలోపం, అవగాహనారాహిత్యంతో ఏటా లక్షలాది మహిళలు మృత్యువాత పడుతున్నారని  చెప్పారు. దేశం ఆర్ధికంగా ఎదుగుతోందని గణాంకాలు చెప్తున్నా ఆ ప్రగతి ప్రజల జీవన ప్రమాణాల్లో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రొమ్ము క్యాన్సర్‌ను సులభంగా గుర్తించేందుకు ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర  ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని మిన్నీ మాథ్యూ హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 1200 మంది ఏఎస్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, గుర్తింపు  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకోసం నిపుణులైన వైద్యులు సహాయం  తీసుకుంటున్నట్లు వివరించారు.