మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాటల్ని తూటాలుగా మలిచి, దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన వీర వనిత అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ విప్లవాగ్నిగా చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకం అని వెల్లడించారు. చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉంది, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప సందేశం అని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ కారులను, పోరాట యోధులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుంది అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.