మీరు ఇటుక వేస్తే మేం రాయివేస్తాం!
– తెలంగాణ సర్వస్వతంత్య్ర రాష్ట్రం
– మీ ఆటలు ఇకసాగవు
– మీ నీళ్లు మీరు వాడుకోండి
– సీఎం కేసీఆర్
– టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి, పాయం
హైదరాబాద్,మే4(జనంసాక్షి): తెలంగాణకు నీటి అంశంలో ఆంధ్రా నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మిణంలో రాజకీయాలు వీడాలని,నీరు ఎలా ఉపయోగించుకోవాలో తాను చెబుతానని ఎపి సిఎం చంద్రబాబుకు హితవు పలికారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమే వారి లక్ష్యమని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు బెదరబోమని హెచ్చరించారు. తమకు పక్క రాష్టాల్రతో కలిసి ఉండేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని… కానీ ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. గోదావరిలో నీటి లభ్యత ఉన్నప్పుడు, తమకు తీసుకునే అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతలకు అభ్యంతరం ఏమిటో తెలియడం లేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణపై యుద్ధం ప్రకటించారని కేసీఆర్ ఆరోపించారు. హక్కుల సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అవన్నీ సాధించుకు తీరుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రా నేతల కుట్రలను పసిగట్టి తెరాసలో చేరిన నాయకులకు తన అభినందనలు తెలియజేస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. తెరాసలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణ వైకాపాను టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎంత వరకైనా తెగిస్తామని, చంద్రబాబు, జగన్ ఆటలు ఇక సాగవు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. ఇవాళ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయడం, ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం సరికాదన్నారు. మేము మాత్రమే బతకాలి.. విూరు బతకొద్దు అనే ఉద్దేశంతో ఏపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలు ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు, జగన్‌కు తెలియడం లేదు. కుళ్లు రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెడితే వాళ్లకే మంచిది కాదన్నారు. కూర్చున్న బెబ్బులిని తట్టి లేపితే.. విూరే భంగపడుతారని హెచ్చరించారు. 368 టీఎంసీల కృష్ణా జలాలు, 950 టీఎంసీల గోదావరి జలాలు తెలంగాణ వాడుకోవచ్చని గతంలోనే అధికారికంగా జీవో జారీ చేశారని గుర్తు చేశారు. జీవో ప్రకారమే గోదావరి, కృష్ణా జలాల వినియోగానికి ప్రాజెక్టులు కడుతున్నామని తెలిపారు. గతంలో జరిగిన తప్పులు జరగొద్దని, ఆకుపచ్చ తెలంగాణ కోసమే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరి నదిలో రెండు రాష్టాల్రకు సరిపోగా ఇంకా మిగులు జలాలు ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని తాను అమరావతి వెళ్లినప్పుడు చంద్రబాబుతో గంట సేపు చర్చించానని గుర్తు చేశారు. ఏపీకి నిజంగా నీళ్లు కావాలనుకుంటే.. జగన్, చంద్రబాబు కుట్రలు మానుకోవాలన్నారు. ఏపీ ప్రజల క్షేమం కోరే విూరు నీటిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలని సూచించారు. నీటి వినియోగంపై తాము సలహా ఇస్తామన్నారు. వీరిద్దరికి ప్రజల క్షేమం పట్టదు, గోదావరిలో నీళ్లు తీసుకునే తెలివి చంద్రబాబుకు లేదన్నారు. సహకరిస్తామన్నా కూడా కుట్రలు చేయడం సరికాదన్నారు. ఉన్న మర్యాద పోగొట్టుకోవద్దు అని
సూచించారు. ఇరు రాష్టాల్రు గోదావరి జలాలు సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఇంత నీటి లభ్యత ఉన్నప్పుడు ప్రజలను మభ్య పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఆరునూరైనా సరే.. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని ఉద్ఘాటించారు.
నాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం: పొంగులేటి
తెలంగాణ ప్రాజెక్టుల పట్ల జగన్ నిరసనపై ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. జగన్‌కు ఆంధ్రా ముఖ్యమైతే తనకు తెలంగాణ ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల స్వప్రయోజనాల కోసం విూరు దీక్ష చేపడితే.. తెలంగాణ ప్రజల కోసం టీఆర్‌ఎస్‌లో చేరడం తప్పు లేదన్నారు. జగన్ వైఖరికి నిరసనగా వైసీపీకి తాను పాయం వెంకటేశ్వర్లుతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజీనామా చేశామని గుర్తు చేశారు. ఏపీ ప్రజల పక్షాన పోరాడే విషయంలో న్యాయం ఉంది కానీ, తెలంగాణ రైతుల పొట్టగొట్టొద్దన్నారు. తెలంగాణను మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్‌కు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ గొప్ప పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. బుల్లెట్ లాంటి లీడర్ కేటీఆర్ అని కొనియాడారు. మిషన్ కాకతీయ పనుల విషయంలో పారదర్శకంగా పని చేస్తున్న హరీష్‌రావును అభినందిస్తున్నానని చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోవడం సంతోషకరంగా ఉందన్నారు. అనుకున్న సమయంలోగా మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందనే ప్రగాఢ విశ్వాసం తనకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోతామని తెలిపారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైకాపా అధినేత జగన్ దీక్ష చేపట్టడాన్ని వ్యతిరేకించే తాను పార్టీని వీడినట్లు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఆంధప్రదేశ్ పక్షాన పోరాడటంలో తప్పులేదని… దానితో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తాను తట్టుకోలేకపోయానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మెచ్చే తాము తెరాసలో చేరినట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు. పాలనలో తెలంగాణలో కేసీఆర్‌ను మించిన ఘనులెవరూ లేరని పొంగులేటి కొనియాడారు. కేసీఆర్ సూచనలను క్రమం తప్పకుండా ప్రభుత్వం, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ఈనెల 16న జరిగే పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వీరి చేరికతో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తెరాసలో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఏడు జిల్లాల వైకాపా అధ్యక్షులుబుధవారం తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్… వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు: పాయం
తెలంగాణ అభివృద్ధిని చూసి ఆంధ్రా పార్టీలు ఓర్వలేక పోతున్నాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా పాయం మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉండటం తమ అదృష్టమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ముందుకెళ్తుంటే ఆంధ్రా పార్టీలు బురదజల్లుతున్నాయని ధ్వజమెత్తారు. కోటి
ఎకరాలకు నీరందించి బంగారు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తుంటే కుట్రలు, కుతంత్రాలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రా పార్టీల కుట్రలను తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాజెక్టులు కడుతుంటే ఏపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్నలను పొందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనకు పాటుపడుతామని స్పష్టం చేశారు.