ముగిసిన మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలకు ముగిసింది. రాష్ట్రంలో 6,596మద్యం దుకాణాలున్నాయి. చివరి రోజు కావడంతో టెండర్‌దారులు గ్రేటర్‌ పరిధిలోని అబ్కారీ భవన్‌కు వందల సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వం నూతన విధానం ప్రకారం హైదరాబాద్‌ నగర పరిధిలోని దుకాణాలకు కోటి 4లక్షలు, నగర శివారులో 10వేల లోపు జనాభా ఉన్న ప్రాంతానికి 33లక్షల, పదివేల పైబడిన జనాభా ఉన్న ప్రాంతానికి 42లక్షలు రుసుముగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ధూల్‌పేట పరిధిలోని 212 మద్యం దుకాణాలకు దరఖాస్తూ చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. శివారు ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 15మందికి పైగా ముందుకు రాగా నగర పరిధిలో ఒక్కో దుకాణానికి నలుగురు చొప్పున కూడా ముందుకు రాలేదు. నగర పరిధిలోని మద్యం దుకాణాలకు ఆశించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్‌శాఖ మరోమారు టెండర్లకు పిలిచే అవకాశం ఉంది.