ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌న్లపై ఆలస్యం వద్దు
– ఇది ఎన్నికల హామీ
– కార్యాచరణ దిశగా కదలండి
– సబ్‌ప్లాన్ ఏర్పాట్లు చేయండి
– తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
కరీంనగర్, మే 29(జనంసాక్షి): ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే వారికి రిజర్వేషన్ తప్పకుండా ప్రభుత్వం కల్పించాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని జ్యోతిరావ్‌బా పూలే మైదానంలో ముస్లిం సబ్‌ప్లాన్ రిజర్వేషన్ పోరాట కార్యచరణ కమిటీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తేనే సమానత్వం వుంటుందని లేదంటే వారు తీవ్రంమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారనిఅన్నారు. భారత రాజ్యంగం దళితులకు, గిరిజనులకు సామాజిక వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించారని అయితే మతపరమైన రిజర్వేషన్ లేదని కానీ ముస్లింలు ఎంతో వెనుక బాటు తనంతో వున్నారని వారిని సమాజంలో అన్నిరంగాల్లో అభివృద్ది జరిగేలా చూడాలని సూచించారు. ఆర్థికంగా వెనుబడిన తరగతులకు ఎలానైతే సమానంగా అవకాశం కల్పిస్తారో అదే విధంగా వీరికి కల్పించాలని డిమాండ్ చేశారు. సచార్ కమిటీ, రంగనాథన్ కమిటీ గతంలో ముస్లింల వెనుకబాటు తనం పై నివేదికలు ఇచ్చిందని వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. సుధీర్ కమిటీ రిపోర్టు వెంటనే ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం ఎన్నిక హామిలో ఇచ్చిన వాగ్ధానం నిలుపుకోవాలని కోరారు. సామాజికంగా ఆర్థికంగా ముస్లింలు వెనుకబడివున్నారని వారిని ఆదుకోవడానికి ముస్లింలకు ఉపప్రణాళిక చేయాలని దానికి చట్టబద్దత కూడా కల్పించాలని కోదండ రామ్ అన్నారు. పాలనలో భాగస్వామ్యం పైసాలో భాగస్వామ్యం వుండాలని అపుడు ముస్లింలు దేశ అభివృద్దిలో భాగస్వాములవుతారని చెప్పారు. ఈ సమావేశంలో టిజెఎసి జిల్లా కన్వీనర్ జక్కోజు వెంకటేశ్వర్లు మార్వాడి సుదర్శన్ వసిమోద్దిన్; అబ్బాస్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.