మెస్‌ ఛార్జీలు పెంచాలి : ఎఐఎస్‌ఎఫ్‌

కడప, జూలై 20 : రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు కూడా పెంచాలని ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మెస్‌ ఛార్జీల పెంపు, వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై శుక్రవారం నాడు కలెక్టరేట్‌ ముట్టడి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్‌ నాయకుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం చెల్లిస్తున్న మెస్‌ ఛార్జీల వల్ల విద్యార్థులు కడుపు నిండక అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. కనీసం నెలకు 1500 రూపాయల చొప్పున మెస్‌ ఛార్జీలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలపై ఎఐఎస్‌ఎఫ్‌ ఈ నెల 9నుంచి జిల్లాలో సైకిల్‌ జాతా నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా అనేక వసతి గృహాలను సందర్శించామని తెలిపారు. అనేక వసతి గృహాల్లో విద్యార్థులు ఆరకొర సౌకర్యాలతో సరిపుచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వార్డెన్‌, మేట్రిన్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.