రంజాన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

కరీంనగర్‌, జూలై 19: పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లీంలకు ఇబ్బందులు కల్గకుండ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేటులో రంజాన్‌ మాసంలో ప్రత్యేక ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ముస్లీం మత పెద్దలు, ప్రముఖులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మత పెద్దల విజ్ఞప్తి మేరకు ప్రార్థన, ఇతర పనులకు ఆటంకం కల్గకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామని, నిబంధన మేరకు ఉదయం 8నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2-30 నుండి 4-30 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. రాత్రివేళల్లో హోటల్స్‌, ఇతర షాపులు తెరిచి ఉంచుటకు అనుమతిస్తామని తెలిపారు. రంజాన్‌ మాసంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా టాంకర్ల్‌ ద్వారా మజీద్‌ పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తామని తెలిపారు. రంజాన్‌ మాసంలో ఏలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారశుద్ధ్య చర్యలు గైకోనాలని సూచించారు. నిత్యావసర సరకులు, సకాలంలో అందించాలని, గ్యాస్‌ బుక్‌ చేసిన వేంటనే అందేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ఎస్‌.పి.డాక్టర్‌ రవీందర్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఆర్‌.ప్రసాద్‌, ట్రాన్సుకో అధికారి ఎస్‌.రంగారావు, జిల్లా అధికారులు, ఆర్‌డిఒలు, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు వాహజోద్దీన్‌, సెక్రటరీ అహ్మద్‌, టౌన్‌ సెక్రటరీ అబ్బాస్‌ షమి, ముస్లీం మత పెద్దలున్నారు.