రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29: కోటగిరి మండలం పోతంగల్‌ గ్రామ పరిధిలోని 13 గ్రామాలకు చెందిన రైతులు రెండు రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  రైతులు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్న రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు రబీ ప్రణాళికను ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఖరీఫ్‌లోనే వ్యవసాయానికి ఏడుగంటల పాటు నిరంతర విద్యుత్‌ ఇవ్వాల్సి ఉండగా కేవలం 5 గంటలు మాత్రమే విద్యుత్‌ అందించడంతో రబీ సాగుపై తమకు ఆశలు నిరాశలవుతున్నాయన్నారు. రబీ సీజన్‌లో తమకు 7గంటల పాటు నిరంతర విద్యుత్‌పై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పష్టమైన హామీ నివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. నిజాంసాగర్‌ ఆయకట్టుకింద తమ భూముల్లో వేలాది ఎకరాలు ఉన్నా యని, సాగునీటి విడుదలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. సింగూరు జలాలలను నిజాంసాగర్‌కు తరలించి సాగునీటి సరఫరాపై స్పష్టమైన హామీనివ్వాలన్నారు. సాగునీరు, విద్యుత్‌ సరఫరాపై ప్రభుత్వం హామీ నిస్తేనే ఖరీఫ్‌ పండించేందుకు రైతులందరం సిద్దమవుతామని వారు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రెండు గంటల పాటు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి కలెక్టర్‌ బయటకు రావాలని నినాదాలు చేశారు. అనంతరం జెసి హర్షవర్ధన్‌ స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీనివ్వడంతో వారు ధర్నా విరమించారు.