రాజీవ్‌ స్వగృహ లబ్దిదారులకు ఊరట

శ్రీకాకుళం, ఆగస్టు 1: శ్రీకాకుళంలో రాజీవ్‌ స్వగృహ లబ్దిదారులకు ఊరట లభించింది. బుధవారం జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌ గౌర్‌ ఎస్‌.ఎం.పురంలో రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న గృహాలను పరిశీలించి, లబ్దిదారుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. గృహాలకు పూర్తి విలువను చెల్లించినప్పటికి వాటిని అప్పగించలేదని లబ్దిదారులు కలెక్టరుకు తెలిపారు. బ్యాంకులకు నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నామని, అదే సమయంలో గృహాల అద్దెలు చెల్లించి వాటిలో నివశిస్తున్నామని ఇది భారంగా ఉందని వారు పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ క్లాసిక్‌, ఇంట్రిన్సిక్‌, బేసిక్‌, సివిక్‌ నాలుగు కేటగిరి ఇళ్ళకు నగదు చెల్లించినవారికి ఇళ్ళను త్వరితగతిన అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్లాసిక్‌ 8 మంది, ఇంట్రిన్సిక్‌కు 10మంది, బెసిక్‌కు 17మంది, సివిక్‌కు 18 మంది నగదు చెల్లించారని స్వగృహ జనరల్‌ మేనేజర్‌ టి.జి.శివాజి తెలిపారు. ఆయా కేటగిరీలకు మంజూరైనవారికి ఒకే వరుసలో ఇళ్ళను సిద్ధం చేయాలని అన్నారు. కనీస అవసరాలైన నీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను తక్షణం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. బిల్లులు త్వరితగదిన చెల్లిస్తే ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల తహశీల్దారు, రాజీవ్‌ స్వగృహ అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.