రెండో టెస్టుకు స్పోర్టివ్‌ పిచ్‌

సీమర్లకు అనుకూలించే అవకాశం
బెంగళూర్‌ ,ఆగస్టు 29 : భారత్‌ , న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు స్పోర్టివ్‌ పిచ్‌ రూపొందిస్తున్నారు. బెంగళూర్‌ చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌లో పిచ్‌ సీమర్లకు అనుకూలించే అవకాశముందని తెలుస్తోంది. ఇక్కడ జరుగుతోన్న 20వ టెస్ట్‌ మ్యాచ్‌ ఇది. గత కొన్ని రోజులుగా పిచ్‌ తయారు చేయడంలో క్యూరేటర్‌ నారాయణ్‌రాజు నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలోని పిచ్‌ పూర్తిగా స్పిన్నర్లకు అనకూలించడంతో ఇప్పుడు సీమర్లకు పాజిటివ్‌గా ఉండే విధంగా వికెట్‌ తయారు చేస్తున్నారు. స్పోర్టివ్‌ వికెట్‌ రెడీ చేస్తున్నామని , అయితే కొద్దిగా గడ్డి ఉంచడం వల్ల సీమర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్‌ రాజు చెప్పాడు. ఈ పిచ్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ నుండే ఇసుక కొనుగోలు చేసినట్టు తెలిపాడు. అయితే గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో కాస్త ఆందోళన ఉన్నప్పటకీ… మ్యాచ్‌ జరిగే రోజుల్లో వాతావరణం బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ వర్షం పడినా… అవుట్‌ఫీల్డ్‌లో నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ విధానం చక్కగా ఉందని పిచ్‌ క్యూరేటర్‌ వివరించాడు. నిన్న సాయంత్రం బెంగళూర్‌ చేరుకున్న ఇరు జట్లూ ఇవాళ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. తొలి టెస్టులో ఓడిపోవడంతో న్యూజిలాండ్‌ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. రెండో టెస్ట్‌ గెలిచి సిరీస్‌ సమం చేయాలన్న పట్టుదల వారిలో కనిపిస్తోంది. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిధ్దం చేసుకుంటోంది. నెట్స్‌లోఎక్కువసేపు బ్యాటింగ్‌ పైనే కివీస్‌ క్రికెటర్లు దృష్టి పెట్టడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. మరోవైపు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు టీమిండియా సిధ్ధమవుతోంది. తొలిటెస్టులో స్పిన్నర్లతోనే విజయం సాధించిన ధోనీ రెండో టెస్టుకు జట్టు కూర్పుపై ఆలోచనలో పడ్డాడు. స్పోర్టింగ్‌ వికెట్‌ తయారు చేస్తుండడంతో బౌలింగ్‌ కూర్పుపై మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. సీమర్లకు అనుకూలిస్తే… మాత్రం ముగ్గురు పేసర్లు , ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే ఛాన్సుంది.