రైతాంగ సంక్షోభానికి బీజేపీ, కాంగ్రెస్‌లే కారణం

వారికి రైతులపట్ల చిత్తశుద్ది లేదు: జీవన్‌ రెడ్డి
నిజామాబాద్‌,జూన్‌7(జనం సాక్షి):

దేశంలో రైతాంగ సంక్షోభానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహా కాంగ్రెస్‌ పార్టీలే ప్రధాన కారణమని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. రైతులను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణమని ఆయన మండిపడ్డారు. రైతులకు గత మూడేళ్ళ లో దేశంలో ఏ ప్రభుత్వం చేయని మేలును టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేసిందని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా వేల కోట్ల రుణ మాఫీ చేయలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనందువల్లే మిర్చి కొనుగోళ్లలో కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమేనని అయన చెప్పారు. మిర్చి మినహా అన్ని పంటల ఉత్పత్తులను రికార్డ్‌ స్థాయిలో కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ఇక రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ పాలనా పాపమే కారణమని పల్లా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. మరోవైపు బీజేపీ నేతలు రైతులపై మొసలి కన్నీళ్లు కార్చడం మానాలని సూచించారు. తెలంగాణలో రుణమాఫీ గిట్టుబాటు ధరలు జరిగిన తీరును బీజేపీ నేతలు తమ జాతీయ నాయకత్వానికి తెలియ జేస్తే బాగుంటుందని సూచించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అసలు బీజేపీకి రైతుల సమస్యలే తెలియవని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు పని లేదని, అందుకే లేని పోని అంశాలపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.