రైతుల ఆత్మహత్యలకు, సంక్షోభానికి కాంగ్రెస్‌ కారణం : చారి

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో రైతు సంక్షోభానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబించిన విధానాలే కారణమని మాజీ ఎంపి, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌ వేణుగోపాలాచారి విమర్శించారు. గత పదేళ్ల పాపానికి వారు ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని కాంగ్రెస్‌నేతలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి రైతు గర్జన పేరుతో అరిస్తే ప్రలజు చూస్తూ ఊరుకోరని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ముందు నుంచి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వేలమంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలే కారణమని ఆరోపించారు. అవన్నీ లెక్కలు చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఒక పక్క ప్రాజెక్టులకు అడ్డుతగులుతూనే మరోపక్క కేసులు వేయడం కాంగ్రెస్‌పార్టీ నేతలకు చెల్లిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ విమర్శలు మాని చేసిన పనులకు లెంపలు వేసుకోవాలన్నారు. రైతలును ఆదుకునేందుకే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నామని అన్నారు.

——————-