రైతు నెత్తిన యూరియా పిడుగు

బస్తాకు రెండున్నర రూపాయలు పెంచిన ప్రభుత్వం
ఆవేదన చెందుతున్న రైతాంగం శ్రీ ప్రభుత్వ చర్యపై మండిపడ్డ ‘దీదీ’
న్యూఢిల్లీ, అక్టోబర్‌  11 (జనంసాక్షి) :
కేంద్రం రోజుకో వస్తువు ధరను పెంచి సామాన్యుడి నడ్డి విరిచేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహ రిస్తోంది. ఓ వైపు నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచి జనాన్ని ఆపద కుహరంలోకి నెట్టిన ప్రభుత్వం, మొన్నటికి మొన్న గ్యాస్‌ సిలిండర్లను కుదించి జనాన్ని హైరానాకు గురి చేసింది. ఇప్పుడు దేశానికి వెన్నెముకలాంటి రైతులకు అండగా ఉంటామని చెబుతూనే, వారిపై పరోక్ష యుద్ధం ప్రకటించింది. అసలే వర్షాలు లేక, పంటలు పండక, అతివృష్టి, అనావృష్టితో సతమతమవుతున్న అన్నదాత నెత్తిన మరో పిడుగు వేసింది. యూరియా రేట్లను పెంచి రైతులపై తీరని భారం మోపింది. ఏకంగా  బస్తాకు రెండున్నర రూపాయల చొప్పున రేటును పెంచేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పంటల కాలాల్లో యూరియా సరిగా సరఫరా చేయకుండా, రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వానికి రేట్లు పెంచే హక్కు లేదంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అసలే వ్యవసాయానికి        రోజురోజుకు ఆదరణ తగ్గుతుంటే, దానికి రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, దానికి సంబంధించిన రేట్లను పెంచి అన్నదాతలకు ఇంకా నిరాసక్తత పెరిగేలా వ్యవహరిస్తోందని మండి పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రం నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డారు. డీజిల్‌ ధరలు పెంచినందుకు, తాము యూపీఏకు మద్దతు ఉపసంహరించినా ఇంకా బుద్ధి రాలేదని, ఇప్పుడున్న మద్దతు ఇస్తున్న పక్షాలు కూడా విరమించుకునేలా ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించారు. వెంటనే డీజిల్‌, నిత్యావసరాలు, యూరియా ధరలను తగ్గించాలని ఆమె డిమాండ్‌ చేశారు.