రైతు, విద్యుత్‌ సమస్యలపై టిడిపి ధర్నా

విజయనగరం, జూలై 18 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ శాఖ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. అంతేకాక వేళాపాళాలేని విద్యుత్‌కోతను నిరసిస్తూ సాగిన ఈ ధర్నాకు పార్టీ ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌తో కలిసి మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అన్ని నియోజకవర్గాల స్థాయిలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన వ్యవసాయం, విద్యుత్‌ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అనంతరం తహశీల్దార్‌ లక్ష్మారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు ప్రసాదుల రామకృష్ణ, ఐవిపి రాజు తదితరులు పాల్గొన్నారు.