రైల్వే సేఫ్టీ కమిషన్‌ విచారణ

నెల్లూరు, ఆగస్టు 2 : నెల్లూరు నగరంలోని విజయమహల్‌ గేట్‌ సమీపంలో రైల్వే క్రాసింగ్‌ వద్ద ఈ నెల 13న జరిగిన రైలు ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన రైల్వే సేఫ్టీ కమిషన్‌ విచారణ చేపట్టింది. కమిషన్‌ చైర్మన్‌ దినేష్‌కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణకు ఢిల్లీ నుంచి చెన్నై వరకు రైల్వే శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 87 మంది అధికారులు హాజరు కాగా, ప్రమాదం సంఘటనలో ఉన్న ప్రత్యక్ష సాక్షులలో మిథున్‌ నాయర్‌ అనే వ్యక్తి ఒక్కరే హాజరయ్యారు. మిథున్‌నాయర్‌ చెన్నైలోని జమినీ కమ్యునికేషన్స్‌లో పనిచేస్తున్నారు. ఆయన వెల్లడించిన వివరాల మేరకు తాను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-11 బోగిలో పై బెర్త్‌లో నిద్రిస్తుండగా, అదే కంపార్ట్‌మెంట్‌లో తనతోపాటు ప్రయాణిస్తున్న రామలింగం అనే స్నేహితుడు గట్టిగా కుదపడంతో నిద్ర లేచానని, అప్పటికే బోగిలో దట్టమైన పొగలు అలుముకుని మంటలు వ్యాపించాయని, పరిస్థితిని గమనించిన తాను ఎస-్‌10లోకి పరిగెత్తి కిందికి దూకానని చెప్పాడు. ఈ ప్రమాదంలో లక్ష రూపాయలు విలువ చేసే కెమెరా, ల్యాప్‌ట్యాప్‌ పోగొట్టుకున్నానని చెప్పారు. తాను కిందికి దిగి ఆ బోగివైపు చూసే సరికి అగ్ని కీలలు దట్టంగా అలుముకున్నాయన్నారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మరో సాక్షి రైల్వే గేట్‌మన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సుమారు 4.15 నిమిషాల ప్రాంతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ మంటలతో కూడుకుని రావడాన్ని గమనించానని, వెంటనే డ్రైవర్‌కు ప్రమాదం సూచిస్తూ ఎర్రజెండా ఊపానని చెప్పారు. రైలు విజయమహల్‌ గేట్‌ వద్ద నిలిచిపోగా, ఈ సమాచారాన్ని రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు అందజేశామని, అప్పటికే బోగిపూర్తిగా దగ్ధమైందన్నారు. క్షతగాత్రుల వివరాలు అందించేందుకు కమిషన్‌ ముందుకు జిల్లా వైద్యాధికారి మాసిలామణి హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో 8 మంది, బొల్లినేని సూపర్‌ స్పెషాలిటీలో ఇద్దరు చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ ప్రాంతానికి చెందిన సుఖదేవ్‌ సింగ్‌(36) కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అలాగే ఇదే ప్రమాదంలో గాయపడిన విజయవాడకు చెందిన ఎన్‌వీ సాంబశివరావు చెన్నైకి తరలించామని, 80 శాతం శరీరం కాలిపోవడం వల్ల ఆయన కూడా మృత్యువుతో పోరాటం చేస్తున్నారని వైద్యాధికారి తెలిపారు. నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారంతా వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు కమిషన్‌ చైర్మన్‌ దినేష్‌కుమార్‌ సింగ్‌ రోగులను పరామర్శించారు.