రోడ్డు ప్రమాదంలో న్యూస్ రీడర్ బద్రి దుర్మరణం
చికిత్స పొందుతూ కుమారుడు మృతి
ద్వారకాతిరుమల: పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి(40) దుర్మరణం చెందారు. ఆయన వెళుతున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పేలి పోవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఒక వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో బద్రి మృతి చెందగా, ఆయన భార్య లక్ష్మీ సుజాత, ఇద్దరు పిల్లలు సాయి, సాత్విక్ లకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు నుంచి విజయవాడకు తరలించారు. బద్రి ఛాతికి స్టీరింగ్ బలంగా నొక్కుకోవడం వల్ల ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామమైన ఉంగుటూరుకు మరికొద్ది నిమిషాల్లో చేరుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ప్రక్క సీటులో ఉండగా.. బద్రి స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైయ్యారు. గత పదేళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ రీడర్ గా కొనసాగుతున్న ఆయన ఆకస్మిక మృతి పట్ల సాక్షి మీడియా గ్రూపు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.
ఆయన మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.