లక్ష్మిపేట ఊచకోత కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్ర

– లక్ష్మిపేట పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా తారకం ఆరోపణ
విజయనగరం, జూన్‌ 25 (ఎపిఇఎంఎస్‌): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట దళితులపై జరిగిన ఊచకోత సంఘటనకు సంబంధించిన కేసును నీరు గార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి సభ్యులు బొజ్జా తారకం తీవ్రంగా ఆరోపించారు. ఈ కేసుపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా ఈ హత్య సంఘటనలో మృతి చెందిన వారి మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించకుండా మృత దేహాలను ఎలా అప్పగించారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీమోహన్‌ సోదరడు పోస్టుమార్టంను అడ్డుకున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం ఎఎస్పీ సంతకాలు చేసి మృత దేహాలను పంపించారని ఈ సంఘటనతో అతనికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి పరిశోధనాధికారిగా వ్యవహరిస్తున్న ఏఎస్పీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంఘటనకు సంబంధించి సాక్షులు, స్థానికులు స్టేట్టమెంట్లను ఎఎస్పీ స్వయంగా విచారించి రాయల్సి ఉన్నప్పటికీ ఈ పనులను సిఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు మాత్రమే నిర్వహించడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. స్టేట్‌మెంట్లు రికార్డు చేయడంలో సాంకేతిక కారణాలు బలహీనం అయితే కేసు వీగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ హత్య ఉదాంతాన్ని ఆధారాలు లేకుండా చేయడంలో ప్రభత్వుం, మంత్రులు, రెవెన్యూ, పోలీసు అధికారులు కీలకపాత్ర వహిస్తున్నారని వీరంతా ముద్దాయిల తరుఫున పనిచేస్తున్నారన్న అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ముద్దాయిలను వెంటనే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటి చట్టం కింద అరెస్టు చేయాలని, లక్ష్మిపేట గ్రామంలోనే ప్రత్యేక కోర్టు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వెంటనే ఆ ప్రాంతంలోనే మాల, మాదిగలతో పాటు చాకలి, మంగళి కుటుంబాలకు 250 ఎకరాల భూములను పంపిణీ చేయాలన్నారు. ఈ సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణగా చూపిస్తున్నదని, ఇది ఎంత మాత్రం ఘర్షణ కాదని హత్యాకాండ అని అన్నారు. గ్రామంలో ఉన్న పోలీసు పికెట్‌ను ఈ నెల 12న ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కేవలం హత్యాకాండను జరిపేందుకు పోలీసు పికెట్‌ను తొలగించినట్లు స్పష్టమవుతుందన్నారు. దీనిపై న్యాయం జరగక పోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘ నాయకులు లోగిశ రామకృష్ణ్‌, సత్యనారాయణ, అప్పారావు, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.