లోకాయుక్త జస్టిస్‌గా సుభాషణ్‌రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) :రాష్ట్ర నూతన లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగింది. దైవసాక్షిగా ఇంగ్లిష్‌లో ప్రమాణం చేసిన సుభాషణ్‌రెడ్డి బాధ్యతలు లోకాయుక్తగా స్వీకరించారు. ప్రమాణ స్వీకర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత లోకాయుక్త జస్టిస్‌ ఎస్‌.ఆనందరెడ్డి గురువారం పదవీ విరమణ చేయడంతో.. ఆయన
స్థానంలో సుభాషణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. వివాదరహితుడిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ఆయన పేరొందారు. కేరళ హైకోర్టు, మద్రాస్‌ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. నిక్కచ్చిగా, నిజాయితీగా పని చేస్తారని ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. నిజాయితీ, నిరాబండరతకు మారుపేరుగా నిలిచిన ఆయనను ప్రభుత్వం పట్టుబట్టి మరీ లోకాయుక్తగా నియమించింది. మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా పని చేసిన సుభాషణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమించేందుకు తొలుత గవర్నర్‌ నరసింహన్‌ నిరాకరించారు. హక్కుల కమిషన్‌గా పని చేసిన వ్యక్తిని లోకాయుక్తగా నియమించకూడదని అభ్యంతరం తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఆయననే నియమించాలని పట్టుబట్టారు. గతంలో చాలా మంది హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా, లోకాయుక్తగా పని చేశారని, ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ఆయన ఉదాహరించారు. సుభాషణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమించాల్సిందేనని స్పష్టం చేయడంతో.. గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. లోకాయుక్తగా ఆయనను నియమిస్తూ.. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సుభాషణ్‌రెడ్డిని గవర్నర్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు అభినందించారు.